- 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా లైఫ్ సైన్సెస్
- దేశ జీడీపీలో మన వాటాను 10 శాతానికి పెంచేందుకే “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం
- బయో ఏషియా 2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, మహా: తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం రెండేళ్లలోనే (డిసెంబర్ 2023 – జనవరి 2026) రూ. 73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, లక్ష ఉద్యోగాలను సృష్టించామని వివరించారు. బుధవారం హైటెక్స్ లో “బయో ఏషియా 2026” సదస్సులో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం చుట్టామన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే…. తెలంగాణ నెక్స్ట్ – జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030), తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్, 1బయో ఇంక్యూబేటర్, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ఫార్మా విలేజెస్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ను మరింత బలోపేతం చేసేందుకుప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు, ఎగుమతుల్లో అయిదో వంతు వాటా తెలంగాణదే కావడం మనకు గర్వకారణమన్నారు. ఈ ఏడాది సదస్సులో సనోఫీ, ఒపెల్లా, వ్యాక్సిండో యానిమల్ హెల్త్, ట్రెడెన్స్, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు ముందుకొచ్చాయన్నారు. బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే తదితర దేశాల నిపుణులతో లైఫ్ సైన్సెస్ రంగంలో రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం అయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు. ‘బయో ఎకానమీ’ రంగంలో మూడో అతిపెద్ద శక్తిగా ఎదగడానికి భారత్ కు ఉన్న అవకాశాలు, తెలంగాణ పాత్రపై చర్చించి… ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో కలిసి ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈసారి ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రతినిధులతో పాటు దేశ విదేశాల నుంచి మొత్తం 4,394 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాల కోసం 4వేలకు పైగా అత్యున్నత స్థాయి బిజినెస్ టూ బిజినెస్(బీ2బీ) సమావేశాలకు ఈ ఏడాది సదస్సు వేదికగా నిలిచిందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని తమ ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మాత్రమే చూడటం లేదని, ఒక సామాజిక బాధ్యతగా చూస్తున్నామన్నారు. అన్ని రకాలుగా పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.








