హైదరాబాద్, మహా : కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ 95 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఈ సారైనా బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రజలను ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట మభ్యపెట్టి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోని నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నదని.. తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని.. రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడానికి.. ప్రతీ మహిళకు మహాలక్ష్మి కింద నెలకు రూ.2,500.. రైతుబంధును రూ.15 వేలకు పెంచాలని.. ఇప్పటికే మూడుసార్లు పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు పాత బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలని కోరారు.








