- ఉత్తుత్తి గ్రూపులతో బ్యాంకులో లోన్లు…
- ఐకెపి సిబ్బంది మాయాజాలం..
- లోన్లు ఇచ్చిన బ్యాంకు మేనేజర్ పాత్రధారే…
- మొట్లగూడెంలో స్వరాజ్, వినాయక్ గ్రూపుల పేరుతో అక్రమం
- లింకేజీ రుణం పేరుతో
రూ. 12లక్షలు కాజేసిన ఘనులు - కారేపల్లి ఐకేపీ లో భారీ అక్రమం
కారేపల్లి, మహా: కంచే చేను మేసిన చందంగా ఉంది కారేపల్లి మండలంలో కొందరి ఐకెపి అధికారుల తీరు. సంస్థలను వ్యవస్థలను కాపాడాల్సిన అధికారులే అడ్డగోలు పనులకు ఆస్కారం ఇచ్చి అభాసు పాలవుతున్నారు. ఐకెపి అధికారులు ఓ బ్యాంకు అధికారి కాసులకు కక్కుర్తి పడి కారేపల్లి మండలం మొట్లగూడెం కేంద్రంగా జరిగిన అక్రమం ఇది. ఉత్తుత్తి గ్రూపులతో భారీ అక్రమానికి తెరలేపారు కొందరు ఐకేపీ సిబ్బంది.. నిబంధనలకు విరుద్ధంగా ఆ గ్రామానికి సంబంధం లేని వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులను ఆయా గ్రూపుల్లో సభ్యులుగా చేర్చి కారేపల్లి లోని గ్రామీణ వికాస్ బ్యాంకులో బ్యాంకు లింకేజీ రుణం రూ. 12 లక్షలు కాజేశారు.
*స్వరాజ్, వినాయక్ గ్రూపుల పేరుతో అక్రమం…
కారేపల్లి మండలంలోని మోట్లగూడెం గ్రామానికి చెందిన అప్పటి అధికారులైన గ్రామ దీపిక, సీసీ, ఏపీఎం, బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కై ఈ భారీ అక్రమానికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మోట్ల గూడెం గ్రామానికి చెందిన స్వరాజ్, వినాయక్ గ్రూపుల్లో కారేపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం గ్రామాలకు చెందిన వారిని సభ్యులుగా చేర్పించారు. నిబంధనల ప్రకారం మోట్లగూడెం గ్రామానికి చెందిన వారినే సభ్యులుగా చేర్చి వారికి రుణం ఇవ్వాల్సి ఉంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి అప్పటి గ్రామ దీపిక, అప్పటి సీసీ వారికి సంబంధించిన బంధువులు స్నేహితుల పేర్లను చేర్పించి బ్యాంకు లింకేజీ కోసం కారేపల్లి లోని గ్రామీణ వికాస బ్యాంకులో రెండు గ్రూపుల్లో 12 లక్షలు రుణం తీసుకుని కాజేశారు. స్వరాజ్ గ్రూపుకు రూ. 6.50 లక్షలు, వినాయక్ గ్రూప్ కి ఆరు లక్షలు బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకొని కాచేశారు. అధికారులు ఇచ్చిన ఫైల్ లో గ్రూపు సభ్యులందరి ఆధార్ కార్డులను ఐకెపి అధికారులు సమర్పించారు. వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సిన బాధ్యత బ్యాంకు మేనేజర్ పై ఉంటుంది. ఐకెపి అధికారులతో కుమ్మక్కైన బ్యాంకు మేనేజర్ వివిధ ప్రాంతాలకు చెందిన ఆధార్ కార్డు దారులు వివిధ బ్యాంకుల అకౌంట్ల నెంబర్లు ఇచ్చినప్పటికీ వాటిని పరిశీలించకుండానే బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు. ఈ 12 లక్షల ను పంచుకున్న వారు కొన్ని నెలలు అనుమానం రాకుండా వాయిదాలను కూడా కట్టారు. తర్వాత రెండేళ్లుగా డబ్బులు కట్టడం మానేయడంతో ఈ రెండు గ్రూపుల అప్పు మొండి బకాయి కిందికి వెళ్ళింది. రికవరీ కోసమని ప్రస్తుత బ్యాంకు మేనేజర్ గ్రూప్ సభ్యులను అడగగా ఆ డబ్బులు మేము తీసుకోలేదని మా అకౌంట్లో మాత్రమే వాడుకున్నారని సమాధానం రావడంతో ఈ మాయాజాలం అంతా వెలుగు చూస్తుంది.
*సీసీ పై కేసు పెట్టాలంటున్న అప్పటి మేనేజర్….
ఈ బ్యాంకు లింకేజీ రుణం మాయాజాలంపై అప్పటి ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ ను ఫోన్లో వివరణ కోరగా.. ఐకెపి నుంచి తప్పుడు పద్ధతిలో ఫైల్ సబ్మిట్ చేసి రెండు గ్రూపులకు లోన్లు ఇప్పించిన అప్పటి సీసీ పై కేసు నమోదు చేయించాలని పేర్కొన్నారు.








