- పేదల పెన్నిధి కాంగ్రెస్ ప్రభుత్వం
- ఆర్థిక కష్టాల్లోనూ సంక్షేమానికి పెద్దపీట
- అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు
- ఎవరైనా డబ్బులు అడిగితే నాకే ఫిర్యాదు చేయండి!
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీలో మంత్రి జూపల్లి
కొల్లాపూర్, మహా: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన లబ్ధిదారులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎవరైనా డబ్బులు అడిగితే సహించేది లేదని, నేరుగా నాకు ఫిర్యాదు చేయండి అన్ని స్పష్టం చేశారు. కొల్లాపూపూర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గానికి చెందిన 180 మంది లబ్ధిదారులకు 1.81 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఆడపిల్ల పెళ్లిలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పుల వల్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వలేకపోయారని ద్వజమెత్తారు.
ఏది ఏమైనా.. అందరికీ సమాన న్యాయం చేయడం, నిరుపేదల కుటుంబాలు వెలుగులు నింపడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నదని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు . ప్రతి ఇంటికి ఇల్లాలే వెలుగని, మహిళ లక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ. 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేదల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందుతున్నాయన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నామని తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర వంటి వాటిని ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రజా ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.








