- ట్రంప్ సర్కార్‌కు రీఫండ్ గండం
- రూ.12 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే
- రీఫండ్ కోసం కోర్టుల్లో వేల కేసులు
- 12 నుండి 18 నెలల సమయం పట్టవచ్చంటున్న న్యాయ నిపుణులు
మహా : ట్రంప్ సర్కార్ కు రీఫండ్ టెన్షన్ పట్టుకుంది. ప్రపంచ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సుంకాల ద్వారా వసూలు చేసిన భారీ మొత్తాన్ని ఎలా రీఫండ్ చేస్తారనే విషయమై సందిగ్ధత నెలకొంది. ట్రంప్ ప్రభుత్వానికి టారిఫ్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 133 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 12 లక్షల కోట్లు. ఇప్పుడు ఆ డబ్బును కంపెనీలకు ఎలా తిరిగి ఇస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ రీఫండ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండబోతోందని, కొన్ని నెలల సమయం పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ రీఫండ్లు ప్రధానంగా వస్తువులను దిగుమతి చేసుకున్న కంపెనీలకే అందుతాయని తెలుస్తోంది. వస్తువుల ధరలు పెరగడం వల్ల నష్టపోయిన సాధారణ వినియోగదారులకు వాపసు డబ్బులు వచ్చే అవకాశం తక్కువని సమాచారం. ఈ నేపథ్యంలో రీఫండ్ కోసం కంపెనీలు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదుకాగా, మరిన్ని కేసులు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
రీఫండ్ కోసం ప్రత్యేక వెబ్ సైట్
రీఫండ్ కు 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. 1990ల్లో హార్బర్ నిర్వహణ రుసుము వంటి వాణిజ్య సంబంధిత కేసుల్లో అమెరికాలోని పలు న్యాయస్థానాలు ఇదే తరహా తీర్పునిచ్చాయి. ఆ సమయంలో కంపెనీలకు రీఫండ్ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారీ మొత్తంలో డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉండటంతో కంపెనీల కోసం ట్రంప్ ప్రభుత్వం ఓ వెబ్‌సైట్ రూపొందించే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. రీపంఢ్ ప్రక్రియలో పలు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సరఫరాదారులకు ఏవైనా రీఫండ్ దక్కితే దానిలో భాగం కావాలని ఉత్పత్తిదారులు కేసులు వేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనల్లో కొన్నేళ్ల నుంచి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు.
ఇంకో ఐదేళ్ళు పడుతుందన్న ట్రంప్
సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డోనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కోర్టుల్లో మరో ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్ర ప్రజల తరపున బిలియన్ల కొద్దీ డాలర్లను ట్రంప్ ప్రభుత్వం నుంచి రీఫండ్‌గా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లినాయిస్ గవర్నర్ జెబి ప్రిట్జ్‌కర్ తన రాష్ట్రంలోని 5.11 మిలియన్ల కుటుంబాల తరపున వాపసు కోరుతున్నారు. ట్రంప్‌ను ఉద్దేశించి ప్రిట్జ్‌కర్ గవర్నర్ ప్రచారం విడుదల చేసిన ఒక లేఖలో, సుంకాల వల్ల ప్రతి ఇల్లినాయిస్ కుటుంబానికి 1,700 డాలర్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే తదుపరి చర్య తీసుకుంటామని ప్రిట్జ్‌కర్ హెచ్చరించారు.








