- క్లినికల్ రీసెర్చ్ లో విప్లవాత్మక మార్పులు
- హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్
- డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో ‘హెల్త్ కేర్’ అనుసంధానం
- సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేస్తేనే సమాజానికి మేలు
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, మహా
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్ ను… డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. లండన్ కేంద్రంగా పనిచేసే ‘ప్యూస్’ ఆధ్వర్యంలో ‘కనెక్ట్ 2026’ పేరిట హెచ్ఐసీసీలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఏఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్ లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే… ఏఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్ కు శ్రీకారం చుట్టామన్నారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందన్నారు. అందుకోసం… పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఫ్యూస్ బోర్డు ఛైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







