హైదరాబాద్, మహా
మహిళల ఆర్ధికాభివృద్ధికి తెలంగాణ చర్యలు బాగున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయలో జరిగిన జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ , సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క , బ్యాంకర్లతో కలిసి పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనుసీతక్క వివరించగా, సదస్సులో హర్షం వ్యక్తమైంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 46.68 లక్షల మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారని, గత రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ. 35,435 కోట్ల బ్యాంక్ రుణాలు మంజూరు చేశామని, రూ. 1,121 కోట్ల వడ్డీ మాఫీతో పాటు, లోన్ , ప్రమాద బీమా పథకాల అమలు చేస్తున్నామని వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతరలో మహిళా సంఘాలకు రూ. 3.5 కోట్ల లాభం వచ్చిందని, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల ద్వారా స్థిర ఆదాయాలు పొందుతున్నారన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలంగాణ చర్యలను ప్రశంసించారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరిగితేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్లు కలిసి పనిచేస్తే మహిళా సాధికారత మరింత వేగవంతమవుతుందన్నారు.







