Mahaa Daily Exclusive

  రణరంరంగా కామారెడ్డి..

Share

  • రణరంరంగా కామారెడ్డి
  • కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
  • రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు
  • చెదరగొట్టిన పోలీసులు
  • ఆంక్షలు విధించి పరిస్థితిని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు
  • అనుమతి లేకుండా ఎవరూ రావద్దని పోలీసుల సూచన

కామారెడ్డి, మహ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయ సెగలు ఒక్కసారిగా మిన్నంటాయి. భూముల కబ్జా ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు విసురుకున్న సవాళ్లతో పట్టణం యుద్ధవాతావరణాన్ని తలపించింది. కామారెడ్డిలో గత కొద్దిరోజులుగా సాగుతున్న భూకబ్జా ఆరోపణలు బహిరంగ చర్చకు దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అరోరా భూములను కబ్జా చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సవాల్‌గా తీసుకున్న ఎమ్మెల్యే, దమ్ముంటే తన క్యాంప్ ఆఫీస్ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్ శ్రేణులు చర్చకు సిద్ధమవ్వడంతో ఉద్రిక్తత మొదలైంది. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించి, కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ అప్పటికే వేచి ఉన్న బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణ హింసాత్మక రూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఉద్రేకంతో కారును అమాంతం బోల్తా పడేయడం కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. దీంతో పరిస్థితి మరింత అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. చర్చకు వెళ్లకుండా ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డిని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికార పక్షం అండతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఘర్షణలు జరగకుండా పట్టణంలోని పలువురు ముఖ్యమైన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే నేతల ఇళ్ల వద్ద నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టడంతో పాటు, అనుమానితులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులతో రాజకీయ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. చర్చా వేదికగా ప్రకటించిన శిశు మందిర్ పాఠశాల పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి, అపరిచిత వ్యక్తులు ఎవరినీ అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వందలాది మంది పోలీసుల మోహరింపుతో ఆ ప్రాంతం కర్ఫ్యూను తలపించింది. మీడియా ప్రతినిధులను కూడా పరిమితంగానే అనుమతించారు. చర్చా వేదిక నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శనగా బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు ముఖాముఖి ఎదురుపడటంతో వాగ్వాదం మొదలై, అది కాస్తా తీవ్ర స్థాయి దాడులకు దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ గందరగోళంలో కాంగ్రెస్ నాయకుడికి చెందిన కారును బీజేపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్నారు. పరిసథితి మరింత విషమించకుండా ఉండేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు పట్టణంలో భయానక వాతావరణాన్ని రేకెత్తించింది. ఇటు కంగ్రెస్, అటు బీజేపీ శ్రేణులు రెచ్చిపోయి బల ప్రదర్శనకు సన్నద్దం కావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అదనపు బలగా రంగంలోకి దించిన పోలీసు అధికారులు ఇరు పార్టీల నేతల కార్యకలాపాలపై నిఘాను తీవ్రం చేశారు.

బీజేపీ నేతల హౌస్ అరెస్టులు

కామారెడ్డి పట్టణంలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంబో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే కట్టడి చేశారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్ళేందుకు సన్నద్దమైన బీజేఎల్ పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో హౌజ్ అరెస్టు చేసారు. ఏలేటిని హౌజ్ అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిజామాబాద్ కు వెళ్ళేందుకు సమాయాత్తం కాగా ఆయనను షామీర్ పేటలోని నివాసంలోనే నిర్భంధించారు. అరివి నేతలను పోలీసులు కట్డి చేశారని తెలుసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కామారెడ్డి వెళ్తానని ప్రకటించడంతో ఆయనను తార్నాకలోని నివాసంలో గృహ నిర్బంధం చేసారు.

సంయమనం పాటించాలన్నపోలీసులు

కామారెడ్డి పట్టణంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పార్టీల నేతలు, కార్యకర్తలు, కామారెడ్డి పట్టణ ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, నేతలెవరూ పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా కామారెడ్డికి రావద్దని సూచించారు.