Mahaa Daily Exclusive

  పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో వ్యతిరేకత ఎదుర్కొన్నాను…

Share

  • పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో వ్యతిరేకత ఎదుర్కొన్నాను
  • నా ఆలోచనలను నేతలకు చెప్పి ఒప్పించి మెప్పించా
  • మెరిట్ లిస్టే పార్టీకి ప్రామాణికం
  • డీసీసీ పదవి చాలా విలువైనది
  • ఎన్నో మెట్లకు మొదటి మెట్లకు మొదటి మెట్టు ఈ పదవి
  • తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్, మహా : కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారిపై వేధింపులు చేసే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలో కొంత మంది నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. అందరినీ సమన్వయంతో కలుపుకుంటూ పోయి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏ లిస్టులూ ఉండవని తెలిపిన రేవంత్‌.. కేవలం మెరిట్‌ లిస్ట్ ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు ఉందని తెలిపారు. ఈ పరిస్థితి వేరే పార్టీలో లేదన్నారు. పార్టీ వేదికలపై వేర్వేరు అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన అలాంటి నేతలను వేధించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని స్పష్టం చేశారు. ఇది గతంలో మహాత్మాగాంధీ ఉన్నప్పటి నుంచి కొనసాగుతోందని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నేతలం మనలో మనం ఘర్షణలకు దిగితే పార్టీని కాపాడటం కోసం కష్టపడుతున్న లక్షల మంది కార్యకర్తలకు అన్యాయం చేసినట్లు అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సన్నద్ధత, ప్రజలతో అనుసంధానం కోసం కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిని అయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేదని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాను పార్టీలో ఉన్న కొందరు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నానని తెలిపారు. తన ఆలోచనలను పార్టీలోని అందరి నేతలను కలిసి చెప్పి అందర్నీ ఒప్పించానని వెల్లడించారు. కార్యకర్తలు, నేతలు అందరూ కలిసి కృషి చేయడంతోనే పార్టీకి ఓటింగ్‌ పెరిగిందని తెలిపారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా మంచిగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం కృషి చేసిన మరో 60 మంది నేతలకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇచ్చామని వెల్లడించారు. నేతలందరి పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్న సీఎం మెరిట్‌ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఎలాంటి లిస్టులకు చోటు లేదని కేవలం మెరిట్‌ లిస్ట్ ప్రకారమే అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. డీసీసీ పదవి చాలా విలువైందని వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీసీసీ పదవి ఎన్నో పదవులకు తలుపులు తెరుస్తుందని పీసీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కూడా కావొచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గాంధీ కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన రేవంత్ రెడ్డి దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప కుటుంబం గాంధీలది అని గుర్తు చేశారు. దేశం కోసం వేల కోట్ల ఆస్తులను మోతీలాల్‌ నెహ్రూ త్యాగం చేశారని ఎన్నో ఏళ్లు జవహర్‌లాల్‌ నెహ్రూ జైలులో ఉన్నారని గుర్తు చేశారు. భారతదేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య నడిచారని పేర్కొన్నారు. గాంధీల కుటుంబంపై అవినీతి ఆరోపణలు గట్టిగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు. నరేంద్ర మోడీ పాలనలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని, మనమంతా సామాన్య ప్రజల గొంతుకగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంజిరాగాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రధానులుగా పని చేసిన సమయంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని, ఆపథకాలను తొలగించేందుకు మోడీ ప్రఎభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్ారు. గాంధీల పేర్లను చెరిపేందుకు పథకం ప్రకారం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో లాగా ఏపీలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేద్దామని పిలుపునిచ్చారు.