- కోట్ల విలువైన సుబాబుల్ కలప అక్రమంగా తరలిపోతోంది…
- సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణలో భూములు తీసుకున్నారు…
- తీసుకున్న భూముల్లో కలపను అక్రమంగా తరలిస్తున్నారు
- టెండర్ లేకుండా నే కాంట్రాక్టర్ రంగంలోకి..
- కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కయ్యారా?
- సీఎం పెద్దమ్మ కొడుకు ఈ కాంట్రాక్టు తీసుకున్నాడని సబ్ కాంట్రాక్టర్ ప్రచారం…
- సీఎం బంధువు పేరు చెప్పి ముఖ్యమంత్రిని బదనాం చేస్తున్న అక్రమార్కులు…
కారేపల్లి, మహా:సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల కోసం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రైతుల నుంచి భూ సేకరణ చేసిన అధికారులు ఆ భూముల్లో ఉన్న సుబాబుల కర్ర విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో కోట్ల విలువైన కలప అక్రమంగా తరలిపోతుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను ఏది విక్రయించాలన్నా అనేక పద్ధతులను పాటించే అధికారులు విలువైన కలప విషయంలో బహిరంగ వేలం కానీ, ఈ టెండర్లు కానీ పిలవకుండా పెద్ద తలకాయల ఒత్తిళ్లతో కొందరు కాంట్రాక్టర్లు, సీతారామ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై కోట్ల సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
*సీతారామ ప్రాజెక్టుకు 168 ఎకరాలు…
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం కారేపల్లి మండలంలోని బాజు మల్లాయిగూడెం, రేలకాయలపల్లి రెవిన్యూ గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం 168 ఎకరాల భూమిని సేకరించింది. రైతులకు పరిహారం కూడా చెల్లించింది. ఈ భూముల్లో 100 ఎకరాలకు పైబడి రైతులు సుబాబుల పంటను సాగు చేశారు. ఈ పంట కూడా కటింగ్ కు వచ్చింది. రైతుల పంటకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకుంది. పరిహారం చెల్లించిన వెంటనే కాల్వ పనులు కూడా ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుబాబుల పంటను కాంట్రాక్టర్కు అప్పగించే తీరులో నిబంధనలను ఏమాత్రం పాటించలేదు. నిబంధనలకు విరుద్ధంగా కోటి రూపాయలు విలువైన 50 లోళ్ళ సుబాబులు ఇప్పటికే అక్రమంగా తరలిపోయింది.
*సబ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో అక్రమ తరలింపు…
చీమలపాడు కు చెందిన ఓ సబ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ కలప అక్రమ తరలింపు వ్యవహారం యదేచ్చగా సాగుతోంది. ఇంజనీరింగ్ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి స్థానికంగా ఉండే ఓ పలుకుబడి కలిగిన వ్యక్తిని సబ్ కాంట్రాక్టు గా నియమించుకుని అక్రమానికి తెరలేపారు.
*సీఎం పెద్దమ్మ కొడుకు కాంట్రాక్టర్ అని ప్రచారం…
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను సీఎం పెద్దమ్మ కొడుకు కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారని స్థానికంగా ఉండే సబ్ కాంట్రాక్టర్ ప్రచారం మొదలుపెట్టాడు. సీఎం బంధువు కాంట్రాక్టర్ కాబట్టి రైతులకు పరిహారం కూడా వెంటనే వచ్చాయని, ఈ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయని ప్రచారం చేస్తూ సబ్ కాంట్రాక్టర్ తన అక్రమ కార్యకలాపాలను రాత్రింబవళ్లు కొనసాగిస్తున్నాడు. అక్రమాలకు పాల్పడే ఈ ముఠా సీఎం పేరు ను కూడా బదనాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*రైతుల కష్టం దళారుల పాలు…
సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను కలిసి వారి ప్రాంతంలో జరుగుతున్న అక్రమాన్ని వివరించారు. కష్టపడి పండించిన పంటను అక్రమంగా దళారులు దోచుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములకు కూడా తక్కువ రేట్ కట్టించారు, పంటకు కూడా ఆశించిన రేటు కట్టించలేదు కాబట్టి ఉన్న పంటను మాకే దక్కే విధంగా అవకాశం కల్పించమని మంత్రి తుమ్మలను రైతులు కోరారు. మంత్రి తుమ్మల కూడా ఈ విషయంపై కలెక్టర్ తో మాట్లాడినట్లు సమాచారం…
*నిబంధనల విషయం దాటేస్తున్న అధికారులు…
సుబాబుల కలపను తరలించడానికి ఎలాంటి నిబంధనలు పాటించాలననే విషయం మీద సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఫోన్లో సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించగా దాటవేస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్ డీఈ కి ఫోన్ చేయగా దీనికి సంబంధించి ఈఈ దగ్గర సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఈ కి ఫోన్ చేయగా డీఈ దగ్గరే సమాచారం ఉంటుందని తప్పుకుంటున్నారు తప్ప ఈ కలప తరలింపు విషయం పై ఎటువంటి నిబంధనలు పాటించారో స్పష్టం చేయకుండా దాట వేస్తున్నారు.







