Mahaa Daily Exclusive

  మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ…

Share

  • మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ
  • దేవ్ జీ, రాజిరెడ్డి సరెండర్
  • మరో 16 మంది సభ్యులు కూడా లొంగుబాటు

హైదరాబాద్, మహా:
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, పార్టీ సెక్రెటరీ జనరల్‌ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్‌ఐబీ ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ తాజాగా లొంగిపోయారు. మరో రెండు రోజుల్లో మీడియా ముందు వీరిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ చేపట్టి పలువురు మావోయిస్టులను మట్టుపెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పి ఎల్ జీ ఏ 1వ బెటాలియన్ మాస్టర్ మైండ్ మాడ్వి హిడ్మా గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవల మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న పాక హనుమంతు సైతం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సుదీర్ఘ కాలం పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న బర్సే దేవా మరికొందరు కీలక మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.

కొద్ది నెలల క్రితం 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోం మంత్రి ముందు లొంగిపోయారు. వీరిలో 98 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత కూడా లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఎదుట కూడా వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నారు. వీరిలో కేంద్ర కమిటీలో ఇద్దరు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో ఒకరితో పాటు మరొకరు ఉద్యమంలో కొనసాగుతున్నట్లు ఇటీవల డీజీపీ వెల్లడించారు.