- సీఐఎస్ఎఫ్ సైక్లోథాన్ 2026 భేష్
- 6553 కి.మీల సైకిల్ యాత్ర అత్యంత క్లిష్టం
- సముద్ర తీర వారసత్వ, రక్షణ బాధ్యతను పునరుద్టాటించిన సైక్లోథాన్
- ఏ రంగంలోనైనా మహిళలు ధ్రుఢంగా ఉంటారనడానికి ఈ సైక్లోథాన్ నిదర్శనం
- కేరళలోని కొచ్చిలో ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్- 2026 లో కేంద్ర మంత్రి బండి సంజయ్
మహా: పాదయాత్ర కొంత సులభం కావచ్చు, బస్సు ప్రయాణం చేయడం సులభమే. కానీ ‘‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్- 2026‘‘ పేరిట సీఐఎస్ఎఫ్ నిర్వహించిన జాతీయ సైకిల్ యాత్ర అత్యంత శ్రమ, సహనంతో కూడకున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అనేక కష్టాలు, అడ్డంకులను ఎదుర్కొంటూ సీఐఎస్ఎఫ్ బృందాలు 6,553 కిలోమీటర్ల మేరకు జాతీయ యాత్రను దిగ్విజయంగా ముగించుకుని గమ్యస్థానాన్ని చేరుకోవడం నిజంగా ప్రశంసనీయమన్నారు. ధైర్యం, ప్రజాసేవా భావనకు శక్తివంతమైన సందేశమని చెప్పారు. భారతదేశ తీరప్రాంతం వేల సంవత్సరాలుగా నాగరికత, వాణిజ్యం, సాంస్కృతిక పరస్పర మార్పిడికి కేంద్రంగా నిలిచిందన్నారు. గుజరాత్‌లోని ప్రాచీన నౌకాశ్రయాల నుండి గోవా సముద్ర తీరాల వరకు, కేరళ మత్స్యకార గ్రామాల నుండి సుందర్‌బన్‌ల మాంగ్రోవ్ అరణ్యాల వరకు మన తీరప్రాంతం భారతదేశ సమృద్ధిగల సముద్ర వారసత్వ కథను చెబుతోందన్నారు. ఈ సైక్లోథాన్ ద్వారా ఆ వారసత్వానికి తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా దాన్ని రక్షించాల్సిన బాధ్యతను మరొక్కసారి పునరుద్ఘాటించిందని తెలిపారు.
కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నిర్వహించిన ‘‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్- 2026‘‘ ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ పద్మాకర్ ఎస్. రణపిసే, సుధీర్ కుమార్, విజయ్ ప్రకాశ్, ఐజీలు ఎస్. ఆర్. సర్వానన్, జోస్ మోహన్, మళయాల నటుడు జయసూర్య, అర్జున పురస్కార గ్రహీత ఐ. ఎం. విజయన్, భారతీయ బ్యాడ్మింటన్ కోచ్ జోయ్ టీ. ఆంటోనీ, మలయాళం నటి సుశ్రీ ప్రయాగ మార్టిన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా CISFకు చెందిన రెండు బృందాల్లో ఒకటి తూర్పు తీరప్రాంతం నుండి, మరొకటి పడమటి తీరప్రాంతం నుండి సైక్లోథాన్ యాత్రను ప్రారంభించి తీరప్రాంతాలన్నీ తిరుగుతూ చివరికి కేరళలోని కొచ్చిలో కలవడాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ ఈ కలయిక మన దేశ ఐక్యతకు, అఖండతకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ ప్రయాణంలో విభిన్నమైన భౌగోళిక పరిస్థితులను అధిగమించి విస్తారమైన దూరాలను అధిగమించి ప్రజలతో నేరుగా సంభాషించి అనుబంధాన్ని పెంచుకోవడం అభినందనీయమని చెప్పారు. సీఐఎస్ఎఫ్ వందే మాతరం తీరప్రాంత సైక్లోథాన్ 2026 యాత్ర కేవలం భారతదేశంలోని విశాలమైన తీరప్రాంతాల గుండా సాగడమే కాకుండా, దేశ ప్రజల హృదయాలను కూడా కలిపే గొప్ప కార్యంగా నిలిచిందన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ గ్రామ సశక్తీకరణ దృష్టికోణానికి అనుగుణంగా, ఈ సైక్లోథాన్ 52 తీరప్రాంత గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా తీరప్రాంత సముదాయాలను జాతీయ భద్రత, అభివృద్ధి ప్రక్రియకు కేంద్ర బిందువుగా నిలిచిందని తెలిపారు. బలమైన సరిహద్దులు, సురక్షిత తీరాలు కేవలం భద్రతా దళాల వల్ల మాత్రమే కాదు, అవగాహన కలిగిన, శక్తివంతమైన, అప్రమత్తమైన పౌరుల వల్లే సాధ్యమవుతాయని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ నౌకాయాన, పోర్టు భద్రతా నిబంధనల ప్రకారం CISFకు ఒక గుర్తింపు పొందిన భద్రతా సంస్థగా కీలక బాధ్యతలను అప్పగించిందని, ఈ సైక్లోథాన్ ఆ నిబద్ధతకు ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు.
ఈ సైక్లోథాన్ కేవలం శారీరక సామర్థ్య ప్రదర్శన మాత్రమే కాదని, మహిళా సాధికారతకు ఒక శక్తివంతమైన ప్రతీక అని కేంద్ర మంత్రి చెప్పారు. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన 130 మంది సైకిల్ యాత్రికుల్లో 65 మంది సైక్లిస్టులు అంటే 50 శాతం మహిళలే ఉండటం గొప్ప విషయమన్నారు. వీరంతా 6,553 కిలోమీటర్ల ఈ దుర్గమ తీరప్రాంత యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ప్రతి రంగంలోనూ మహిళలు దృఢంగా నిలబడగలరని నిరూపించారని చెప్పారు. ఈ సైక్లోథాన్ అందరికీ ప్రేరణగా నిలవడమే కాకుండా ప్రజలతో అనుబంధాన్ని పెంచుతూ, దేశ బలాన్ని పెంచే కొత్త కార్యక్రమాలను కొనసాగిస్తుందని చెప్పారు. CISF ‘ వందే మాతరం తీరప్రాంత సైక్లోథాన్’ ఒక శాశ్వత సంప్రదాయంగా మారి—భారతదేశ తీరప్రాంత గౌరవాన్ని పెంచుతూ, వాటి రక్షకులను గౌరవిస్తూ, దేశమంతటిని సేవ మరియు దేశభక్తి అనే ఒకే దారంలో కట్టిపడేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.







