Mahaa Daily Exclusive

  క‌బ్జాల‌ను తొలగించిన హైడ్రా..

Share

  • క‌బ్జాల‌ను తొలగించిన హైడ్రా
  • ప్ర‌భుత్వ క‌ళాశాల నిర్మాణానికి స‌న్నాహం
  • జై కొట్టిన జ‌నం

హైద‌రాబాద్‌, మహా : కొండాపూర్‌… ఐటీ కారిడార్‌కు చేరువ‌లో.. అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా శ‌నివారం తొల‌గించింది. ఆదివారం అక్క‌డ ప్ర‌భుత్వ క‌ళాశాల ఏర్పాటుకు స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌రిణామాల‌ను చూసి కొండాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి జై కొట్టారు. హైడ్రాను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ద‌శాబ్దాల స‌మ‌స్య‌కు రోజుల్లో.. గంట‌ల్లో ప‌రిష్కారం దొర‌క‌డం.. క‌బ్జాల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన వెంట‌నే.. ప్ర‌భుత్వం అక్క‌డ విద్యా సంస్థ‌లు ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదివారం ప‌ర్య‌టించిన‌ప్పుడు కొండాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు వ‌చ్చి హైడ్రా చ‌ర్య‌ల‌ను అభినందించారు. హైడ్రా కాపాడిన స్థ‌లంలో ప్ర‌భుత్వ క‌ళాశాల ఏర్పాటుకు విద్యా శాఖ ఆదివార‌మే స‌ర్వే చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తమౌతోంది.

ఆక్ర‌మ‌ణ‌లను హైడ్రా తొల‌గించిన వెంట‌నే

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 78 నుంచి 93 లో రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ కాల‌నీ పేరుతో 2059 ప్లాట్ల‌తో 1993లో గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ వేశారు. ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌కు 5 ఎక‌రాలు కేటాయించారు. అలాగే పాఠ‌శాల‌కు దాదాపు ఎక‌రా స్థ‌లం, పార్కుల కోసం ఎక‌రాకు పైగా కేటాయించారు. క‌మ్యూనిటీ హాల్ కోసం 2181 గ‌జాల స్థ‌లాన్ని ఉంచారు. ఇలా కేటాయించిన భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్నాయ‌ని వెంట‌నే కాపాడి రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో కాల‌నీ సంక్షేమ సంఘం కోరింది. ఈ భూముల ఆక్ర‌మ‌ణ‌ల వెనుక బ‌డాబాబులున్నార‌ని ఫిర్యాదు చేసింది. లే ఔట్ ప్ర‌కారం క‌బ్జాల‌ను శ‌నివారం తొల‌గించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రంగ‌నాథ్, సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ సృజ‌న, హైడ్రా ఎసిపి శ్రీకాంత్, హైడ్రా డిప్యూటీ టౌన్ ప్లానర్ రామిరెడ్డితో సహా పాటు ఆయా శాఖ‌ల అధికారులు ఆదివారం కొండాపూర్‌లో ప‌ర్య‌టించి ప‌రిశీలించారు. వెంట‌నే అక్క‌డ ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌లు ఏర్పాటు చేయ‌డానికి విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ క‌ళాశాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు.

పార్కులు, విద్యా సంస్థ‌లు

కొండాపూర్‌లోని రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ కాల‌నీలో పార్కుకు ఉద్దేశించిన స్థ‌లంలో పార్కు నిర్మాణానికి, పాఠ‌శాల‌కు ఉద్దేశించిన స్థ‌లంలో పాఠ‌శాల‌, క‌ళాశాల‌కు ఉద్దేశించిన స్థ‌లంలో క‌ళాశాలతో పాటు ప‌లు విద్యా సంస్థ‌లు ఏర్పాటు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని అధికారులు అక్క‌డి స్థానికుల‌కు చెప్ప‌గా.. వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. ద‌శాబ్దాల పోరాటం ఫ‌లించిందంటూ అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇక్క‌డ పార్కులు, విద్యాసంస్థ‌లు ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ రెసిడెంట్స్ అసోషియేష‌న్ పేర్కొంది. ప‌లువురు అధికారుల‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.