- రాహుల్ ప్రధాని అయితేనే దేశంలో రుగ్మతలకు పరిష్కారం
- దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
- అలాంటి పార్టీని కనుమరుగు చేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది
- ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వికారాబాద్, మహా : రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలోనే రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని, రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వికారాబాద్ లో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సోమవారం “కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం చేయాలి” అన్న అంశంపై డిప్యూటీ సీఎం ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష సమస్య ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షం అవుతారని తెలిపారు. హెచ్ సీయూలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను ఎవరిని కూడా యూనివర్సిటీలోకి రానివ్వలేదు అంటరానితనం సమస్యను సమస్యగా చూడాలి తప్ప రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన అని వివరించారు. ఆయన ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం రాగానే వనరులు సంపద సమానంగా పంచుతామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించారు ఆయన ప్రకటించినట్టుగా అధికారంలోకి రాగానే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ స్వాతంత్రం అనంతరం ఎక్కడా జరగని కుల గణనను ప్రజా ప్రభుత్వం 50 రోజుల్లో పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని వివరించారు.
దేశానికి స్వాతంత్రం సాధించడంతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని తెలిపారు. స్వాతంత్రం ముందు నుంచి దేశంలోని రుగ్మతల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు బిజెపి కాంగ్రెస్ ముక్తభారత్ చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అంటుందన్నారు. ఈ సమాజం సామాజికంగా, ఆర్థికంగా విభజన జరిగి ఇలాగే ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం, తాను కుల వివక్షత ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సమాజంలో కుల వివక్ష ఉంటుంది అన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్య సాధనకు ముందుకు పోతున్న క్రమంలో వివక్ష ఎదురైన అది తన లక్ష్యాలను దెబ్బతీయలేదని వివరించారు. ఏఐసీసీ ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాదు దేశంలో అంటరానితనం, బాల్య వివాహం, వితంతు వివాహం వంటి అనేక రుగ్మతలపై దశాబ్దాలుగా ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు. దేశ స్వాతంత్ర సంగ్రామం ఒకవైపు, సామాజిక అంశాలపై ఆందోళనలో మరోవైపు ఈ దేశంలో రెండు అంశాలను ఏఐసీసీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లిందని వివరించారు. కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలించాలని, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించాలని టీకే మాధవన్ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేరళలో వైకాం సత్యాగ్రహ, మహారాష్ట్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చౌదర్ సత్యాగ్రహం వంటి కార్యక్రమాలను ఏఐసీసీ చేపట్టిందన్నారు. గాంధీజీ ఆధ్వర్యంలో హరిజనోద్ధరణ పేరిట పెద్ద యాత్ర చేపట్టారని దళితుల దేవాలయల ప్రవేశం, దళిత వాడల్లో పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు ఈ దేశంలో అంటరానితనాన్ని తొలగిస్తారని గాంధీ ఓ నమ్మకాన్ని ఏర్పరిచారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దేశంలో అంటరాని తనం నిర్మూలనకు 1049లో ఆర్టికల్ 17 ద్వారా అవకాశం కల్పించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయ కరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని తద్వారా సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని వివరించారు. సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ వంశీ చందర్ రెడ్డి, ఏ ఐ సి సి నాయకులు విశ్వనాథన్, సావంత్, సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు.








