Mahaa Daily Exclusive

  హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి డిమాండ్…..

Share

  • హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి డిమాండ్
  • గచ్చిబౌలిలో రూ. 1.76 లక్షలకు చదరపు గజం
  • కూకట్ పల్లి బాలాజీ నగర్ లో చదరపు గజం రూ. 1.64 లక్షలు
  • బహిరంగ వేలం ద్వారా రూ 34.27 కోట్ల ఆదాయం

హైదరాబాద్, మహా : నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలో చదరపు గజానికి రూ.1.76 లక్షలకు, కూకట్ పల్లిలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. నగరంలోని గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కెపిహెచ్ బి హోసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్ లో సోమవారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. విక్రయించిన వాటిలో బౌరంపేట భూమితోపాటు, బాచుపల్లి లో ఒక ఫ్లాట్ మినహా మిగిలినవ్నీ ఎంఐజి, హెఐజి కేటగిరీలోని ప్లాట్లు కావడంతో వీటిని దక్కించుకోడానికి పలువురు పోటీ పడ్డారు. గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్ కు రూ.50 వేల అప్ సెట్ ప్రైజ్ (కనీస ధరగా) నిర్దారించి వేలం నిర్వహించగా, దీనికి చదరపు గజం రూ. 1.76 లక్ష ల ధర పలికింది. అదే విధంగా కూకట్ పల్లి బాలాజీనగర్ లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్ ను వేలం పాటలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు కూడా మంచి డిమాండ్ తో చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలతో అమ్ముడు పోయినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతం తెలిపారు. అలాగే నిజాంపేటలోని సిద్ధి ఫ్లాట్ కు కనీస ధర రూ.15 లక్షలుగా నిర్దారించగా దీనిని వేలం పాటలో రూ. 17.70 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే గచ్చిబౌలిలోని మరో ప్లాట్ చదరపు గజం లక్ష రూపాయలు పలికింది. కాగా బౌరంపేటలోని 2600 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడు పోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ. 34.27 లక్షల మేర ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ గౌతం వివరించారు.