- తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం
- పంటలకు తీవ్ర నష్టం
- – హైదరాబాద్ లోనూ భారీ వర్షం
హైదరాబాద్, మహా
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లగా, విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఈ వర్షాలతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ఎండ తీవ్రత పెరుగుతండగా.. ఒక్కసారిగా వడగళ్ల వాన, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే రైతులకు మాత్రం తీవ్ర నష్టం కలిగింది. వడగళ్ల వాన కారణంగా ముఖ్యంగా మిర్చి, పత్తి, కూరగాయల పంటలు, ఇతర వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్ల వర్షంతో పంటలు నేలకూలిపోయాయి. అలాగే మరోవైపు ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్ సిటీలో భారీ వర్షం
హైదరాబాద్ సిటీలో వర్షం కురిసింది. చిరు జల్లులు భాగ్య నగరాన్ని చాలా రోజుల తర్వాత పలకరించాయి. అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మీర్ పేట్, బడంగ్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, మలక్ పేట్, సరూర్ నగర్, చార్మినార్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, నాగోల్, అంబర్ పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తాయి.








