- పెళ్లి పేరిట మోసాలు
- బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి
- పరువుకు భయపడి మౌనంగా ఉండొద్దు
- ధైర్యంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయండి
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
హైదరాబాద్, మహా: పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఎక్స్ వేదికగా హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా నిశ్చితార్థం తర్వాత యువతులకు మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడం, ఆపై అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ కు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువతులు, వారి తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
మోసం సాగుతోందిలా
ముందుగా పక్కా ప్రణాళికతో, సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఘనంగా నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ‘ఇక పెళ్లి ఖాయమైంది కదా’ అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ‘ఎలాగూ పెళ్ళే కదా.. ఇప్పుడైతే ఏంటి?’ అని మాయమాటలు చెబుతూ, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఒత్తిడితో శారీరకంగా లోబరుచుకుంటున్నారు. తీరా కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో పరువు పోతుందన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న నయవంచకులు మరింతగా వేధింపులకు గురిచేస్తున్నారు. ‘పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉంటే.. జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరూ భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలి’ అని సీపీ స్పష్టం చేశారు.
ఇవి గుర్తుంచుకోండి
పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై పెళ్లికి ముందే క్షుణ్ణంగా ఆరా తీయాలి. నిశ్చితార్థం జరిగినప్పటికీ, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగానే ఉండాలి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలి. వారి ప్రయత్నాలను మొహమాటం లేకుండా తిరస్కరించాలి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడొద్దు. మోసగాళ్ల చేతిలో చిక్కుకుంటే సంకోచించకుండా పోలీసులను ఆశ్రయించండి. బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి బెదిరింపులు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.








