Mahaa Daily Exclusive

  ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు….

Share

  • ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు
  • బస్సుల సరఫరాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన ఆర్టీసీ
  • హైదరాబాద్ లో మెరుగైన రవాణా వ్యవస్థకు ఉపయోగపడనున్న బస్సులు

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 1085 బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు టిజిఎస్ఆర్టీసీ లెటర్ అఫ్ ఇంటెంట్ జారీ చేసింది. పీ ఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. ఎం ఈ ఐ ఎల్ అనుబంధ సంస్థ ఓ జి ఎల్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ వాణిజ్య వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసే బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఓ జి ఎల్ సరఫరా చేసే బస్సుల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు సుస్థిర , పర్యావరణ హితమైన, సమర్ధవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను టిజిఎస్ఆర్టీసీ అందించనుంది . పట్టణాలలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పి ఎం ఈ డ్రైవ్ పథకం హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్ళనుంది .

టి జి ఎస్ ఆర్ టి సీ కి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఏసీ , నాన్-ఏసీ బస్సులున్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. బస్సు ముందు , వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణ చేస్తాయి. సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ ఛార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్‌చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు.

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓలెక్ట్రా, దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ విభాగంలో ఈ ఆర్ధిక సంవత్సరాంతం , గత ఆర్థిక సంవత్సరం లోనూ తొలిస్థానంలో నిలిచింది. సంస్థ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే కాకుండా, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా 3,600కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఓలెక్ట్రా చేతిలో ప్రస్తుతం 10 వేల విద్యుత్ వాహనాల ఆర్డర్ ఉంది. సంస్థ వాహనాలు ఇప్పటివరకు 500 మిలియన్ గ్రీన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆపరేషనల్ విశ్వసనీయత, నిరంతర సాంకేతిక ఆవిష్కరణలతో ఒలెక్ట్రా దేశాన్ని కర్బన ఉద్గార రహితంగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎండీ మహేష్ బాబు మాట్లాడుతూ “ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. దేశ విద్యుత్ వాహన రంగంలో మా ప్రయాణానికి ఇది ఒక కీలక మైలురాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనే మా కట్టుబాటుకు పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమం కింద వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ఆర్డర్ మరింత బలం చేకూర్చింది.హైదరాబాద్ మా సంస్థ స్వస్థలం మాత్రమే కాదు, ఆవిష్కరణలకు ప్రతీక. టీజీఎస్‌ఆర్టీసీతో కలిసి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన సుస్థిర ప్రజా రవాణా సేవలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ఇది దేశం పర్యావరణ హితంగా ఉండేందుకుఉపయోగపడుతుంది’ అని అన్నారు .