- మరో నలుగురు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు
- 40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమానికి చారిత్రాత్మక ముగింపు
- ఎస్‌ఐబీ ఆపరేషన్లతో 21 వేల మందిపై చర్యలు
- కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతల స్వచ్ఛంద సమర్పణ
- నేపాల్‌లో ఉన్న గణపతి అచూకీపై పోలీసులు నజర్
- మీడియా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు ఉద్యమం తెలంగాణలో దాదాపు ముగిసినట్లేనని, తెలంగాణకు చెందిన కేవలం 11 మంది మాత్రమే ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారని, వీరిలో 10 మంది చిన్న చిన్న స్థానాలలో ఉండగా ఒక్కరు మాత్రం కీలక స్థానంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లొంగపిోయిన నలుగురు నేతలను మీడియా ముందు హాజరు పరిచిన డీజీపీ మాట్లాడుతూ, దాదాపు 40 ఏళ్లుగా సాగిన మావోయిస్ట్ ఉద్యమ చరిత్రకు ముగింపు పలికే విధంగా నలుగురు కీలక అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. లొంగిపోయిన వారిలో దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి (ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ), మల్లా రాజిరెడ్డి (కేంద్ర కమిటీ సభ్యుడు), బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (స్టేట్ సెక్రటరీ), నున్నె నరసింహారెడ్డి (కేంద్ర కమిటీ సభ్యుడు) ఉన్నారు. వీరి లొంగుబాటుతో శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన మావోయిస్ట్ ఉద్యమం, నాలుగు దశాబ్దాల అనంతరం అధికారికంగా ముగింపు దశకు చేరినట్లైందని డీజీపీ పేర్కొన్నారు.
మావోయిస్టులపై చర్యల్లో తెలంగాణ ఎస్‌ఐబీ రికార్డు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మావోయిస్టులపై పలు ఆపరేషన్లు నిర్వహించింది. సోర్స్ బిల్డింగ్, సమగ్ర ఇంటెలిజెన్స్ సేకరణలో ఎస్‌ఐబీ కీలక పాత్ర పోషించింది. ఎస్‌ఐబీ తెలిపిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 14,078 మంది వివిధ స్థాయిలలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసిన వీరిని అరెస్టు చేయడం జరిగింది. వీరితో పాటు మరో 5,865 మంది లొంగిపోయారు. అదే విధంగా 1057 ఎన్ కౌంటర్ లలో మరో 1,289 మంది మృతి చెందారు. కేంద్ర కమిటీకి చెందిన 23 మంది సభ్యులపై కీలక సమాచారం సేకరించిన ఎస్‌ఐబీ 7 మందిని అరెస్టు చేయగా, మరో 7 మంది లొంగిపోయారు. 9 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మొత్తంగా 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో ఎస్‌ఐబీ కీలక పాత్ర పోషించింది.
మావోయిస్ట్ అగ్రనేత గణపతి అచూకీ
మావోయిస్ట్ పార్టీకి దశాబ్దాల పాటు నాయకత్వం వహించిన అగ్రనేత గణపతి అచూకీ లభ్యమైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో పార్టీ సెక్రటరీ పదవిని వదిలిన గణపతి గత కొన్నేళ్లుగా నేపాల్‌లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గణపతి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. గణపతిని భారత్‌కు రప్పించే దిశగా తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చరిత్రాత్మక లొంగుబాటు
కేంద్ర సెక్రటరీ దేవుజి, స్టేట్ సెక్రటరీ బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నున్నె నరసింహారెడ్డి లొంగుబాటు తెలంగాణ రాజకీయ-భద్రతా చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు.మావోయిస్ట్ ఉద్యమానికి ముగింపు పలుకుతూ తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అవతరించబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మీడియాతో మాట్లాడిన సందర్భంగా డీజీపీ గణపతికి సంబంధించిన సమాచారం తెలియదని, అయితే ఈ దశలో కొంత పురోగతి ఉందని నర్మగర్భంగా చెప్పారు. త్వరలోనే మరో కీలక సమాచారం వెల్లడిస్తామని, అదేం ఎక్కువ సమయం కాదని కేవలం నాలుగు రోజుల్లోనే మీ ముందుకు కీలక సమాచారంతో వస్తానని అన్నారు.








