- 1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
- రూ. 3 లక్షల కోట్లు హాంఫట్
- ఐటీ షేర్ల పతనానికి కారణాలివే
మహా : భారత స్టాక్ మార్కెట్లలో మంగళవారంఅమ్మకాల సునామీ కొనసాగింది. సెన్సెక్స్ 1068 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 25,500 దిగువకు పడిపోయింది. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు ఆవిరైంది. ఐటీ రంగం సంక్షోభం, ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు మార్కెట్లను దెబ్బతీశాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ షేర్లలో కొనసాగుతున్న భారీ అమ్మకాలతో దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. క్రితం సెషన్‌లో వచ్చిన లాభాలన్నీ ఒక్కరోజే తుడిచిపెట్టుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు (1.28%) నష్టపోయి 82,225.92 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 50 కూడా 276.35 పాయింట్లు (1.07%) క్షీణించి 25,436.65 వద్ద నిలిచింది. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బిఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹469 లక్షల కోట్ల నుంచి ₹466 లక్షల కోట్లకు పడిపోయింది.
మార్కెట్లను కుదిపేసిన 3 ప్రధాన అంశాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త ట్రేడ్ పాలసీ మార్కెట్లను ఆందోళనలో పడేసింది. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త దిగుమతులపై 15% పన్ను విధిస్తామని ఆయన ప్రకటించారు. గత ఏడాది అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గే దేశాలపై కఠినమైన చట్టాలను ఉపయోగిస్తామని ట్రంప్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెంచింది. అదే విధంగా ఐటీ షేర్లలో అమ్మకాల పర్వం ఆగడం లేదు. మంగళవారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. ఫిబ్రవరి నెలలోనే ఈ రంగం దాదాపు 21% నష్టపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల సంప్రదాయ ఐటీ సర్వీసుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే భయం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గకపోవడం ఐటీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్గత అశాంతి, ప్రభుత్వం చేస్తున్న దాడులు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లను వెనుకాడేలా చేస్తున్నాయి. “ఐటీ రంగంలో ఏఐ తెస్తున్న మార్పులు, ప్రపంచ వాణిజ్య టారిఫ్ ఆందోళనలు దేశీయ మార్కెట్లను దెబ్బతీశాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు.







