Mahaa Daily Exclusive

  కన్న తల్లే రాకాసి…

Share

  • కన్న తల్లే రాకాసి…
  • మాతృత్వానికే మాయని మచ్చ
  • పసికందును పొయ్యిలో వేసి కాల్చేసిన తల్లి
  • బౌరంపేటలో హృదయ విదారక ఘటన

హైదరాబాద్, మహా : రక్షణగా ఉండాల్సిన తల్లే ఆ పసికూన పాలిట రాకాసిగా మారింది. హైదరాబాద్‌ శివారు బౌరంపేట్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన మాతృత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయింది. అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారికి, తల్లి చేతులు రగిల్చిన చితి మంటలు ఎదురవుతాయని ఊహించలేకపోయాడు. మధ్యప్రదేశ్‌ నుంచి పొట్ట చేతబట్టుకుని వలస వచ్చిన రాజేంద్ర, మమత దంపతులు హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌ బౌరంపేటలోని ఒక అపార్ట్‌మెంట్ నిర్మాణ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం తండ్రి పనిలోకి వెళ్లగా, రెండు నెలల పసిగుడ్డు తల్లి దగ్గరే ఉన్నాడు. లోకమే తెలియని ఆ పసివాడు ఆకలికో, ఆవేదనకో గుక్కపెట్టి ఏడ్చాడు. ఆ ఏడుపు ఆ తల్లిలో కనికరాన్ని పెంచాల్సింది పోయి, కసాయి తనాన్ని రగిల్చింది. ఏడుస్తున్నాడన్న కోపంతో ఆ కన్నతల్లి అమానుషానికి ఒడిగట్టింది. పసివాడు కేకలు వేయకుండా ఉండాలని నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసింది. ఆపై ఏకంగా వెలుగుతున్న కట్టెల పొయ్యిలో ఆ పసి ప్రాణాన్ని పడేసింది. నిప్పుల సెగకు ఆ మంటల వేడికి ఆ సుకుమారమైన దేహం ఎంతలా మాడిపోయి ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. లోకంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే, కన్నతల్లి చేతుల్లోనే ఆ ప్రాణం బూడిదైపోయింది.

మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రి రాజేంద్రకు ఎదురైన దృశ్యం నరకాన్ని చూపించింది. కట్టెల పొయ్యిలో తన కొడుకు కాలిపోతుండటం, పక్కనే భార్య నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చూసి అతను కుప్పకూలిపోయాడు. తన బిడ్డను రక్షించుకుందామన్నా అప్పటికే ఆ చిన్నారి బొగ్గులా మారిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ప్రేమను చాటాల్సిన చేతులతోనే, తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చితికి ఆహుతి చేసిన ఈ ఘోరకలి చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ” అమ్మ” అనే పదానికే మాయని మచ్చ తెచ్చిన ఈ మాతృరూప రాక్షసి చేసిన పని అందరినీ కలిచివేస్తోంది.