- కోరుట్ల పాలిటిక్స్ లోకి దేవ్ జీ
- జగిత్యాల జైత్రయాత్ర నుండి పార్టీలో అగ్రస్థానం దాకా
హైదరాబాద్, మహా
నాలుగు దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో తుపాకీ పట్టి పనిచేసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తన అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికారు. ఫిబ్రవరి 26న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అడవి నుండి అగ్రస్థానానికి
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. 1989లో డివిజనల్ కమిటీ మెంబర్‌గా.. తర్వాత 1993లో గడ్చిరోలి సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1995లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, 2001లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. ఆయనకు రమేష్, దేవుజి, సంజీవ్, చేతన్, కుమ్మ దాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయి.
1991లో ఆయన మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన అరికె జైనీ అలియాస్ సృజన అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పెరిమిలి దళంలో సభ్యురాలు. మావోయిస్టు పార్టీలో పాలిట్‌బ్యూరో మెంబర్‌గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దేవ్‌జీ, నంబాల కేశవరావు మృతి తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై ఏకంగా రూ.1.50 కోట్ల రివార్డు ఉండటం ఆయన ప్రాధాన్యతను చాటిచెబుతోంది.








