- సైబర్ నేరస్థుల వలలో బ్యాంక్ మాజీ మేనేజర్
- ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన వ్యవహారంలో కేసు నమోదైందని అంటూ ఫోన్‌కాల్
- రూ.1.44 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్, మహా : ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కెనరా బ్యాంకు మాజీ మేనేజర్‌ను బెదిరించిన సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ రూ.1.44 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కెనరా బ్యాంకు మేనేజర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. జనవరి 17వ తేదీన ఆయనకు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ముంబయి ఏటీఎస్ నుంచి మాట్లాడుతున్నామని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన వ్యవహారంలో కేసు నమోదైందని చెప్పారు. ఆ తర్వాత కుమార్ పేరుతో మరొకరు కాల్‌లోకి తీసుకున్నాడు. కామేశ్వర్ ఆధార్ కార్డు వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు గుర్తించామని, లావాదేవీల వివరాలు తనిఖీలు చేస్తామని చెప్పారు. తనకు ఉగ్రవాదులు, లావాదేవీలతో ఎలాంటి సంబంధంలేదని కామేశ్వరన్ చెప్పినా పట్టించుకోలేదు. ముకేశ్ శర్మ అనే మరో వ్యక్తి కాల్‌లోకి వచ్చాడు.
కోర్టు ఆదేశాల ప్రకారమే తాము పని చేయాల్సి ఉంటుందని, ఈ విచారణ పూర్తయ్యేవరకూ హైదరాబాద్ నగరం దాటి వెళ్లొద్దని సైబర్ నేరగాళ్లు సూచించారు. కోర్టు విచారణకు ముందు కామేశ్వరన్ పేరును క్రైమ్ రికార్డుల్లో తనిఖీ చేయాల్సి ఉందని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత అజయ్‌కుమార్ బన్సల్ పేరుతో మరొకరు కాల్‌లోకి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు కామేశ్వరన్ పేరుతో అనుమానితుడిగా ఉన్నాడని బెదిరించాడు. వృద్ధుడిని వీడియోకాల్‌లోకి తీసుకుని బ్యాంకు లావాదేవీలు తనిఖీ చేశారు. అనంతరం ఏటీఎస్ డీసీపీ ముకేశ్ వర్మ వీడియోకాల్‌లో వచ్చాడు. వృద్ధుడైనందున తాను సహాయం చేస్తానని, అంతకుముందు చెప్పినట్లు వినాలని సూచించాడు.
ఈ కేసు వ్యవహారం గురించి కుటుంబ సభ్యులు సహా ఎవరితోనూ పంచుకోవద్దని, ఆన్‌లైన్‌లో కూడా వెతకొద్దని హెచ్చరించారు. ఫోన్లు స్విచాఫ్ చేయించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇవన్నీ పాటించాల్సిందేనని భయపెట్టారు. కామేశ్వరన్ తాను సహకరిస్తానని చెప్పాడు. బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నందున తనిఖీ చేయాల్సి ఉందని, తాము చెప్పిన ఖాతాలకు డబ్బు బదిలీ చేయాలని ముకేశ్ చెప్పాడు. తనిఖీ పూర్తయ్యాక ఫిబ్రవరి 19వ తేదీన కోర్టు ఆదేశాలతో అంతా తిరిగి చెల్లిస్తామని అన్నాడు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకూ రూ.1.44 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఫిబ్రవరి 19 వచ్చినా విచారణ పూర్తికాకపోవడం, అవతలి వ్యక్తులు బెయిలిప్పిస్తామంటూ వేర్వేరు కారణాలతో పదే పదే డబ్బు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.







