Mahaa Daily Exclusive

  కొత్త వాహనాలపై మరో పన్ను…

Share

  • కొత్త వాహనాలపై మరో పన్ను
  • మార్చి 1 నుంచి కొత్త రూల్
  • రోడ్ సేఫ్టీ పన్ను పేరుతో భారీగా బాదుడు
  • ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ
  • ఖజానాకు అదనంగా రూ. 270 కోట్ల ఆదాయం

హైదరాబాద్, మహా : కొత్త వాహనాల కొనుగోలుపై మరో ట్యాక్స్ పడనుంది. రహదారి భద్రత పన్ను(రోడ్‌ సేఫ్టీ సెస్‌) చెల్లించాలనే నిబంధన మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోటర్ వెహికల్ యాక్ట్ చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా రోడ్డు భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణలో రోడ్డు సెఫ్టీ సెస్ నిర్ణయం అమల్లోకి వస్తుంది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 వరకు రోడ్డు భద్రత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటు ఇతర వ్యక్తిగత వాహనాలు, ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలు ఈ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తాయి.
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారు రూ. 270 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. తేలికపాటి వాహనలైన ద్విచక్రవాహనాల కొనుగోలు చేసే సమయంలో ఈ పన్ను కింద రూ. 2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కార్ల వంటి వాటికి రూ.5 వేలు వసూలు చేస్తారు. గూడ్స్ వెహికల్స్, ఆటోలకు రూ.10 వేల వరకు పన్ను పడే అవకాశాలున్నాయి.