- తెలంగాణపై లుక్కెయ్ రాహుల్
- రేవంత్ దుర్మార్గాలను ఆపండి
- పేదల ఇళ్ళను కూల్చుతున్నారన్న ఎంపీ ఈటల
న్యూఢిల్లీ, మహా : రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాలని, లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తమ పార్టీ పాలనలో ఉన్న తెలంగాణలో ఏ జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని, పెద్దలు వేల కోట్ల భూములు అక్రమించుకుంటే పట్టించుకోవడం లేదన్నారు. కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాలు ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని, పేదల ఇళ్లు మాత్రం కులగొడుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లను ఖాళీ చేయడం, కూల్చడాన్ని ఖండించారు. మధు పార్క్ అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్న ప్రజల ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా పేదలకు భూములు, ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇళ్లును కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొట్టడాన్ని ఖండించారు. ఇల్లు కోల్పోయిన పేదలకు తక్షణమే ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం పేరుతో బుకాయిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో గాంధీ పార్క్ కట్టుకోవాలని, కేంద్రం భూములు ఇచ్చింది అభివృద్ధికి పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ మందులు, బకాయిలకు, డైట్ చార్జీలకు నిధులు లేవని చెప్పి రూ.5 వేల కోట్లు పెట్టి గాంధీ పార్క్ కడతామంటున్నారంటూ ముందు అవి చేసి మీరు ఏమన్నా కట్టుకోండని సూచించారు. తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.






