- భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్
- బిచ్చగాడు సినిమాను గుర్తుకు తెస్తున్న దంపతులు
- కలెక్టర్ నిర్ణయంతో వెలుగులోకి వచ్చిన వైనం
- కనీసం పెన్షన్ అయినా ఇప్పించాలంటున్న దంపతులు
సిరిసిల్ల, మహా : బిచ్చగాడు సినిమాలో హీరో విజయ్ ఆంటోని తల్లి అనారోగ్యం తగ్గాలంటూ 48 రోజులు బిచ్చగాడి దీక్ష తీసుకుంటాడు.ఇది సినిమా కథ.. ఇది కూడా ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందినదే. అయితే ఇలాంటి దీక్షలు చేస్తే ఉద్దేశం నెరవేరుతుందా? నిజంగా అనుకున్నది జరుగుతుందా? కర్మ సిద్ధాంతం ప్రకారం..మునుపటి కర్మల నుంచి విముక్తి పొందేందుకు ఇలాంటి దీక్షలు చేపడితే పాప కర్మలు తగ్గిస్తాయని నమ్మకం. భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 5 ప్రకారం యజ్ఞం, దానం, తపస్సు వంటివి పాపాలను నాశనం చేస్తాయని ఉంది. ఆలయాలను శుభ్రం చేయడం నిష్కామ కర్మ ఇది మనసుని శుద్ధి చేస్తుంది. ఇలాంటి దీక్షలు భక్తిని పెంచి మనుసుని శాంతపరుస్తాయి. ఆయుర్వేదం, యోగ శాస్త్రాల్లో కూడా మనసు-అశరీరం సంబంధం గురించి ఉంటుంది. బిచ్చగాడిలా దీక్ష అంటే సన్యాస దీక్షలు సమానం…ఇది అహంకారాన్ని తగ్గించి దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. తద్వారా అనుకున్నది నెరవేరుతుందని ఆధ్యాత్మివేత్తల మాట. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఓ అడ్వకేట్ తన భార్య ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారారు.
భార్య ఆరోగ్యం కోసం
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఆయన పేరు కాసర్ల జలంధర్ రెడ్డి ,అడ్వకేట్ ..సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్ నగర్ కు చెందిన ఆమె పేరు శిరీష, బీకాం కంప్యూటర్స్ .. ఆయన కరీంనగర్ లో ప్రాక్టీస్ చేస్తే, ఆమె ప్రైవేట్ ఉద్యోగం చేసేది. 2006లో పెళ్లి జరిగింది, పిల్లలు లేరు. అనారోగ్యం పాలైన ఆమె వైద్యం కోసం ఎంతో ఖర్చు చేశారు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. అయితే వేములవాడ రాజన్న సన్నిధిలో భిచ్చమెత్తుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పడంతో మూడు నెలలుగా భిక్షాటన చేస్తున్నారు ఆ దంపతులు. పెళ్లితో ముడిపడిన బంధాన్ని వీడలేక, భార్య ఆరోగ్యంగా ఉంటే చాలు అని భావించి, ఆ భగవంతుడిపైనే భారం వేసి దైవసన్నిధిలో బిచ్చమెత్తుకుంటున్నారు.
వెలుగులోకి వచ్చింది ఇలా….
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు వేములవాడలో బిచ్చగాళ్లకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించారు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏఎస్పీ చంద్రయ్య. ఈ సమయంలో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న ఆ జంటను చూసి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు పెద్దగా ఆస్తులు లేవని, అద్దె ఇంట్లో ఉంటూ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసేవాడినని, తన భార్య ఆరోగ్యం కుదటపడాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయాను అందుకే దేవుడే దిక్కని భావించి ఇలా భిక్షాటన చేస్తున్నాం అని జలంధర్ రెడ్డి చెప్పారు. తనకు పోలియో ఉన్నా పెన్షన్ ఇవ్వడం లేదని జలంధర్ రెడ్డి భార్య శిరీష చెప్పారు. ప్రభుత్వం పెన్షన్ ఇస్తే కొంతైనా సాయం చేసినట్టు అవుతుందని చెబుతోంది ఆమె.
కారణాలు ఏమైనా కానీ.. జలంధర్ రెడ్డి, శిరీష తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తిరుమల లాంటి క్షేత్రంలో భగవంతుడి సేవ చేస్తే ఆరోగ్యం, మనశ్సాంతి లభిస్తుందని చాలామంది నమ్మకం. దీక్షలు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని మరికొందరి నమ్మకం. అయితే ఎలాంటి వైద్య సేవలు తీసుకోకుండా ఇదొక్కటే నయం చేస్తుందని కూడా స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక దీక్షలు మనసుని బలపరుస్తాయి కానీ వైద్య చికిత్సను భర్తీ చేయలేవు. ఎందుకంటే శ్రీరామకృష్ణుడు తన గొంతు క్యాన్సర్ ను దైవిక లీలగా భావించారు కానీ ఆధ్యాత్మికత రోగాన్ని నయం చేయలేదు.. అది మరణానికి దారితీసింది. ఫలితం కేవలం భక్తి, ఉద్దేశం, కర్మలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.







