Mahaa Daily Exclusive

  అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ గా తెలంగాణ…

Share

  • అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ గా తెలంగాణ…
  • 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం
  • ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
  • ‘ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

ముంబై, మహా : తెలంగాణను దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ లల్లో ఒకటిగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆ దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇంటిగ్రేషన్, పాలసీ అండ్ రెగ్యూలేటరీ ఫెసిలిటేషన్, సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ లాజిస్టిక్స్, స్కిల్ డెవలెప్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ తో కూడిన ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ముంబై లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ‘మెస్సే ముంచెన్ ఇండియా(మెస్సే ముంచెన్ జర్మనీ అనుబంధ సంస్థ)’ నిర్వహిస్తోన్న ‘ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక రంగాల్లో ప్రధానమైన ‘లాజిస్టిక్ రంగం’లో 2047 నాటికి తెలంగాణను తిరుగులేని శక్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భౌగోళిక విస్తీర్ణంలో పదకొండు, జనాభాలో పన్నెండో స్థానంలో ఉన్న తెలంగాణ వాటా దేశ జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉందన్నారు. దీనిని 2047 నాటికి 10 శాతానికి పెంచాలనే సంకల్పంతోనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్ కు శ్రీకారం చుట్టామన్నారు. 3 ట్రిలియన్ డాలర్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చేర్చాలనే లక్ష్య సాధనలో లాజిస్టిక్ రంగానిదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల పునర్నిర్మాణం, ఏఐ ఆధారిత ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్, సస్టైనబిలిటీ అనే మూడు ప్రధాన మార్పులు లాజిస్టిక్స్ రంగాన్ని సమూలంగా మార్చేస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో భౌగోళికంగా మనకున్న అనుకూలతలను ‘డిజైన్ అడ్వాంటేజ్’గా మార్చుకుని సత్తా చాటేలా ముందుకెళ్తున్నామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్ – 2, కొత్త ఎయిర్ పోర్టులు, డ్రై పోర్టు, తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ 2.0, లాజిస్టిక్ హబ్స్ తదితర ప్రాజెక్టులు ఈ రంగంలో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా మార్చుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో లాజిస్టిక్స్‌ రంగానికి అవసరమైన రెడీ టూ వర్క్ ఫోర్స్ ను తయారు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. కేవలం వస్తువులను ఉత్పత్తి చేయడమే కాకుండా, వాటిని ప్రపంచం ఊహించని వేగంతో డెలివరీ చేసి ‘లాజిస్టిక్ పవర్ హౌస్’గా ఎదిగే సత్తా తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. మల్టీ మోడల్, రైల్ లింక్డ్ అసెట్స్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్ – ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శకమైన పాలసీలు, ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.