- సైబర్ వలలో సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి
- రూ.10.91 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- పోలీసులను ఆశ్రయించిన విజయలక్ష్మి
హైదరాబాద్, మహా : సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్దతుల్లో వల విసిరుతూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. అయితే వీరి వలలో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు, వర్గాలకు చెందిన వారు కూడా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైబర్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి రూ.కోట్లు కొట్టేశారు. బంగారం సైతం తాకట్టు పెట్టి ఆమె పెట్టుబడులు పెట్టింది. తాజాగా.. సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో వచ్చిన ఫేక్ పెట్టుబడుల వీడియో ప్రకటన చూసి ఆయన భార్య బీవీ విజయలక్ష్మి రూ.10.91 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ వెంటనే సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మి బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేయటం గమనార్హం. గతేడాది డిసెంబరులో సామాజిక మాధ్యమాల్లో నిర్మలా సీతారామన్ పేరుతో ఒక పెట్టుబడి ప్రకటన చూశారు. సెబీ ఆధ్వర్యంలో ట్రేడింగ్‌లో పెట్టుబడులకు అవకాశముందని నమ్మించారు. క్వాంటాపల్స్ సంస్థ ఇందుకు సేవలు అందిస్తోందని చెబుతూ ప్రకటన కింద ఉన్న లింక్ ఉంచారు. విజయలక్ష్మి లింక్ మీద క్లిక్ చేయగా.. ఆర్థిక సలహాదారు ఆదిత్య సుబ్రహ్మణ్యం పేరుతో వాట్సాప్‌లో విజయలక్ష్మికి ఒకరు పరిచయమయ్యారు.
అతడు చెప్పినట్లు చేస్తూ ఒక యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న విజయలక్ష్మి ముందుగా ఎంట్రీ ఫీజు కింద రూ.13 వేలు చెల్లించారు. అనంతరం పెట్టుబడుల పేరుతో ఈ ఏడాది జనవరి 30న రూ.1.99 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత యూకే నుంచి ఆడంస్మిత్ పేరుతో మరో వ్యక్తి సంప్రదించి మొత్తం 32 వేల డాలర్లు అందాయని.. వెరిఫికేషన్ పేరుతో ఆమెకు చెందిన ఎస్‌బీఐ అకౌంట్ వివరాలు అడిగారు. అనంతరం అదనంగా మరో రూ.1.80 లక్షలు కూడా వసూలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ట్రాన్సక్షన్ క్యాన్సిల్ అయిందని చెబుతూ మళ్లీ డబ్బులు పంపాలని కోరారు. ఇలా ఫిబ్రవరి 13వ తేదీ వరకు పలు ధపాలుగా మొత్తం రూ.10.91 లక్షలు వసూలు చేశారు. పెట్టుబడి రిటర్న్స్ ఇవ్వకుండా పదేపదే డబ్బు అడగడంతో ఆమె మోసపోయాని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.







