Mahaa Daily Exclusive

  ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త…

Share

  • ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
  • పెండింగ్ బకాయిల విడుదల
  • రూ.745 కోట్లు విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

హైదరాబాద్, మహా : ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో పెండింగ్‌ బకాయిల కింద రూ.745 కోట్లను శుక్రవారం విడుదల చేశారు. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలోనే రాష్ట ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా బకాయిలు విడుదలయ్యాయి. గత సంవత్సరం జూన్ నుంచి ప్రతి నెలా కనీసం రూ. 700 కోట్లను ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే సర్కార్ ముందుకెళ్తోంది.

ప్రభుత్వం విడుదల చేసిన బిల్లులలో ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులకు సంబంధించిన చెల్లింపులున్నాయి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిధులను విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల కోసం సర్కార్ ఇటీవలనే రెండు కొత్త పథకాలను కూడా ప్రకటించింది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ప్రమాద బీమా పథకం వర్తింపజేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ఈ పథకాన్ని విస్తరించింది. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది.