- గిరిజన విద్యాకుసుమాలు విలవిల: రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల ‘అధ్వాన్నం’!
- వందల సంఖ్యలో విద్యార్థులు.. పదుల సంఖ్యలో హాజరు!
- అటెండెన్స్ మాయాజాలం.. బడ్జెట్ ఎవరి జేబుల్లోకి?
- కరెంట్ తీగల విషవలయంలో గిరిజన బాల్యం!
ఖమ్మం/కారేపల్లి (మహా పత్రిక):
గిరిజన విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆశ్రమ పాఠశాలలు అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల ఉదాసీనతకు బలవుతున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల (AHS) నిర్వహణ తీరును చూస్తుంటే గిరిజన విద్యార్థుల సంక్షేమం గాలికి ఎగిరిపోయిందని స్పష్టమవుతోంది. “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అన్న చందంగా.. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు ఉన్నా, విద్యార్థులకు మాత్రం కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
కాగితాల్లో వందలు.. హాస్టల్లో ముప్పైలే!
ఈ పాఠశాలలో రికార్డుల ప్రకారం 132 మంది (లేదా 150 మంది) విద్యార్థులు ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 36 మంది మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలిన విద్యార్థుల పేరుతో వస్తున్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, ఇతర బడ్జెట్ నిధులు ఏమవుతున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ అటెండెన్స్ మాయాజాలంపై జిల్లా స్థాయి అధికారులు లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
విషవలయంగా ప్రాంగణం.. శిథిలావస్థలో క్వార్టర్స్!
విశాలమైన పాఠశాల ప్రాంగణం ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారింది. విద్యార్థులు తిరిగే చోట కరెంట్ తీగలు వేలాడుతూ మృత్యుపాశాల్లా కనిపిస్తున్నాయి. అపరిశుభ్రత రాజ్యమేలుతుండటంతో హాస్టల్ ప్రాంగణం దుర్వాసనతో కుళ్ళిపోతోంది. టీచర్లు, సిబ్బంది కోసం లక్షలు వెచ్చించి కట్టిన క్వార్టర్స్ సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరాయి.
హెడ్ క్వార్టర్స్ లో ఉండని పంతుళ్లు.. పత్తాలేని పాలన!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏ ఒక్కరూ అందుబాటులో ఉండటం లేదు. “ఎవరికి పుట్టిన బిడ్డలురా ఎక్కి ఏడుస్తున్నారు” అన్న రీతిలో గిరిజన విద్యార్థులను అనాథల్లా వదిలేసి, పంతుళ్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాచ్‌మెన్, సెక్యూరిటీ లేకపోవడంతో విద్యార్థుల భద్రత గాలిలో దీపంలా మారింది.
మెనూ మాయం.. ఆకలి కేకలు!
ప్రభుత్వం నిర్ణయించిన పౌష్టికాహార మెనూ ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదు. కంటితుడుపు చర్యగా నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇటీవల యుఎస్ఎఫ్ఐ (USFI) బృందం పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా, ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆశ్రమ నిర్వాహకుల పరపతి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలి. విద్యార్థుల హాజరుపై స్పష్టత ఇవ్వాలి మరియు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ usfi జిల్లా కార్యదర్శి బి సాగర్ డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో అవినీతి తిమింగలాల పై చర్యలు తీసుకోక పొతే తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు.








