తెలంగాణ రాజకీయ చరిత్రలో పదవులు కాదు, విలువలతో గుర్తింపు పొందిన నాయకుల గురించి చర్చ మొదలైతే ముందుగా గుర్తుకు వచ్చే పేరు దుద్దిళ్ల శ్రీపాదరావు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన శాసనసభ స్పీకర్ పదవిని అలంకరించిన ఆయన జీవితం, అధికారానికి అతీతంగా ప్రజాసేవకు అంకితమైన నాయకత్వానికి ప్రతీక. నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.
1935 మార్చి 2న ప్రస్తుత తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీపాదరావు చిన్ననాటి నుంచే గ్రామీణ ప్రాంత వాస్తవాలను అనుభవం ద్వారా తెలుసుకున్నారు. విద్యపై ఆసక్తితో ముందుకు సాగిన ఆయన హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం నాగపూర్ లో న్యాయశాస్త్రంలో పట్టా సాధించి న్యాయవాదిగా సేవలందించారు. అయితే వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులతో తిరిగి స్వగ్రామానికి చేరి వ్యవసాయాన్ని చేపట్టడం ఆయన నైజాన్ని ప్రతిబింబిస్తుంది. రైతు సమస్యలపై పోరాటం ఆయనలోని విలక్షతను చాటుతుంది.
రాజకీయాల్లో శ్రీపాదరావు ప్రవేశం అధికారం కోసం కాదు, బాధ్యత కోసం. సర్పంచ్‌గా రెండు పర్యాయాలు గ్రామాభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. మహాదేవ్‌పూర్ సమితి అధ్యక్షుడిగా, భూసంబంధ బ్యాంకు చైర్మన్‌గా వ్యవసాయ రంగానికి బలమైన తోడ్పాటు అందించారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయన ప్రత్యేకత.
1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన వేళ, కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి గెలవడం ఆయన వ్యక్తిత్వానికి ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్ర. పార్టీల తరంగాల కంటే వ్యక్తి విశ్వసనీయత పెద్దదని ఆయాన విజయం చాటి చెప్పింది. మొత్తంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాభిమానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు.
1990 నుంచి 1994 వరకు ఆయన ఆంధ్ర ప్రదేశ్ లేజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శ్రీపాదరావుకి అరుదైన గౌరవం. సభా నిర్వహణలో ఆయన నిష్పాక్షికత ఆదర్శప్రాయంగా నిలిచింది. రాజకీయ విభేదాలు ఎంతున్నా, సభా పరిపాలనలో నియమావళి పట్ల కట్టుదిట్టమైన వైఖరి పాటించి ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. అధికారపీఠంపై కూర్చున్నప్పటికీ, వ్యక్తిగత వినయాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ఆయన నాయకత్వానికి మరింత గౌరవం తెచ్చింది.
స్పీకర్‌గా ఉన్నప్పటికీ తన నియోజకవర్గ అభివృద్ధిని మరచిపోకపోవడం ఆయన ప్రత్యేకత. మంథని ప్రాంతంలో మౌలిక వసతులు, విద్యాసంస్థలు, సాగునీటి సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు వేగం అందుకున్నాయి. ప్రజా ప్రతినిధి అంటే సభలో మాటలకే పరిమితం కాకుండా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలనే సందేశాన్ని ఆయన ఆచరణలో చూపించారు.
1994లో ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆయన ప్రజలతో అనుబంధాన్ని కోల్పోలేదు. అధికారంలో లేకున్నా సేవలో వెనుకడుగు వేయలేదు. 1999 ఏప్రిల్ 13న నక్సలైట్ల దాడిలో ఆయన మరణం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిని హింస బలితీసుకోవడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు.ఆ మహానుభావుడి వారసత్వాన్ని ఆయన కుమారుడు దూద్దిళ్ల శ్రీధర్ బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజాసేవలో విలువలను కాపాడే ధోరణి కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతుండటం విశేషం. 2024 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం, స్మారక పురస్కారాల ద్వారా ఆయన స్ఫూర్తిని విస్తరించడం ఇవన్నీ ఆయనకు లభించిన సార్వత్రిక గౌరవానికి నిదర్శనం.
నేటి రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్న వేళ, దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం మార్గదర్శకంగా నిలుస్తుంది. పదవి శాశ్వతం కాదు ప్రజల గుండెల్లో నిలిచే స్థానం శాశ్వతం నానుడి మాట నిజం. అధికారాన్ని వ్యక్తిగత లాభాలకు కాదు, ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలనే సూత్రాన్ని ఆయన జీవితం చెబుతోంది. పల్లె నేల నుంచి సభాపతి పీఠం వరకు సాగిన ఆయన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు ప్రజాస్వామ్య విలువలకు అంకితమైన నాయకత్వానికి చిరస్మరణీయ ఉదాహరణ. తెలంగాణ రాజకీయాలకు ఆయన జీవితం ఒక దిక్సూచి; భవిష్యత్ రాజకీయ తరాలకు ఒక పాఠం.
* అమరవాజీ నాగరాజు*
*పీఆర్ఓ,టీపీసీసీ చీఫ్*








