Mahaa Daily Exclusive

  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్..! దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల..

Share

  • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్
  • దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల
  • క్షేమంగా ఉన్నట్లు సమాచారం

 

మహా : అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు సహా ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగుతోంది. ఇజ్రాయెల్ సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు తమ గగనతలాలను పూర్తిగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకున్నారు. ఐదు రోజుల క్రితం మంత్రి తుమ్మల దుబాయ్‌ వెళ్లగా యుద్దం కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆయన దుబాయ్‌ వెళ్లినట్లు సమాచారం. ట్రీట్‌మెంట్ అనంతరం తిరిగి ఇండియాకు రావాలని భావిస్తున్న తరుణంలోనే పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీంతో మంత్రి ప్రయాణానికి ఆటంకం ఏర్పడి అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల ప్రభావం దుబాయ్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుపై పడింది. ఆదివారం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-3 సమీపంలో క్షిపణి దాడులు జరిగడంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీని కారణంగా వేలాది మంది ప్రయాణికులతో పాటు మంత్రి తుమ్మల కుటంబంతో సహా దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు.