- యుద్ధం ప్రభావం
- వంట గ్యాస్ గండం
- సిలిండర్ల బుకింగ్..సరఫరా పై ఆంక్షలు
హైదరాబాద్, మహా : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం చమురు సరఫరాపై పడింది. ఫలితంగా వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. నాలుగు రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో..అనధికారికంగా ఆంక్షలను ఆయిల్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. బుకింగ్ కోసం తాజాగా నిర్దేశించిన గడువు పూర్తియిన తరువాతనే రిజిస్టర్ చేసుకోవటం ఈ ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. వాస్తవానికి ముడి చమురు నిల్వలు దాదాపు 8 వారాల వరకు ఉన్నప్పటికీ, సరఫరా పూర్తిగా నిలిచిపోతే ఇంధన రేషనింగ్ చేయాల్సిన గడ్డు పరిస్థితి తప్పదనే అంచనాలు మొదలయ్యాయి. ఫలితంగా డొమెస్టిక్ వంట గ్యాస్ వినియోగదారులు ముందుగానే గ్యాస్ రీఫిల్స్ కోసం పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రధాన అయిల్ కంపెనీల డీలర్లు అనధికారికంగా సిలిండర్ బుకింగ్ పైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందు కోసం డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజులు గడువుగా నిర్దేశించారు. చివరి సిలిండర్ అందుకున్న రోజు నుంచి 21 రోజుల తరువాత అయితేనే గ్యాస్ సిలిండర్ తిరిగి బుక్ చేసుకుంటామని చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా… వినియోగదారుల నుంచి పెరుగుతున్న బుకింగ్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. యుద్ద ప్రభావంతో రానున్న రోజుల్లో వంట గ్యాస్ కు కొరత ఏర్పడుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో గతం కంటే భిన్నంగా ఒకే సారి రెట్టింపు సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ లు జరుగుతున్నాయి. నిర్దేశిత గడువు మేరకే బుకింగ్స్ జరిగే విధంగా ఆయిల్ కంపెనీలు వినియోగదారులు ఉపయోగించే పోర్టల్స్, యాప్ ల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసారు. దీంతో ఈ యుద్దం మరింత కాలం కొనసాగితే వంట గ్యాస్ తో పాటుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలోనూ సమస్యలు వస్తాయనే చర్చ సాగుతోంది.








