Mahaa Daily Exclusive

  బీహార్ లో నితీష్ వారసుడి కోసం పోటీ..! రేసులో ముగ్గురు కీలక నేతలు..

Share

  • బీహార్ లో నితీష్ వారసుడి కోసం పోటీ
  • రేసులో ముగ్గురు కీలక నేతలు
  • తొలిసారి బీజేపీకి దక్కనున్న సీఎం పదవి

పాట్నా, మహా : పదే పదే రాజీనామా చేస్తూ పదిసార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ దురంధరుడు నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎగువ సభలోనూ ప్రాతినిధ్యం వహించాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకు సీఎం పదవిని త్యాగం చేశారు. అంతే కాకుండా రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞత చెప్తూ, రాబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి మద్దతూ, సహకారం ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచీ బీహార్ చట్టసభలో రెండు సభలకూ, పార్లమెంటులో కూడా ఎగువ దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించాలని తనకు కోరిక ఉందని ఇప్పుడది నెరవేరబోతోందని కూడా చెప్పేశారు. ఇప్పటికే నితీష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి గా పనిచేసినప్పుడు లోక్ సభ నుంచే ప్రాతినిధ్యం వహించారు. బీహార్ అసెంబ్లీ, ఎగువ సభ సభ్యుడుగా కూడా ప్రాతినిధ్యం వహించారు.

 

ఇప్పుడు అందరి ఆసక్తీ నితీష్ తరువాత బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ జోరందుకుంది. నితిష్ కంటే ముందు బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జంగిల్ రాజ్ గా పేరుపడ్డ బీహార్ ను నితీష్ గాడిన పెట్టే ప్రయత్నం చేసారు. అభివృద్ది మంత్రంతో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మిత్రపక్షంగా, ఎన్డీయే భాగస్వామికి మొదట సీఎంగా కొనసాగిన నితీష్ పొత్తు ఏ పార్టీతో వున్నా సీఎం పీఠం మాత్రం తనకే దక్కేలా చూసుకున్నారు. గత రెండు శాసన సభల్లోనూ భిన్న పార్టీలతో పొత్తుతో పోటీచేసిన నితీష్ బలం ఒకసారి ఆర్జేడీకన్నా తక్కువగా వున్నా, ప్రస్తుతం బీజేపీ కన్నా తక్కువగా వున్నా సీఎం పదవి మాత్రం తనదే అనిపించుకున్నారు.

 

ఎట్టకేలకు బీజేపీకి బీహార్ సీఎం పదవి ..

 

243 స్ధానాలున్న ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 202 స్ధానాలుండగా అందులో మెజారిటీ (89) బీజేపీనే దక్కించుకోగా నితీష్ పార్టీ జేడీయూ 85 స్ధానాలే దక్కించుకుంది. ఐనప్పటికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా ముఖ్యమంత్రిగా నితీష్ నే అంగీకరించింది బీజేపీ. నితీష్ సీనియారిటీ, పాలనపై ఆయనకున్న పట్టు ఆయనకు కలిసొచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు నితీష్ రాజ్యసభకు వెళ్తుండటంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారన్న అంచనాలున్నాయి. మరి బీహార్ కి సీఎంగా ఎవరొస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నితీష్ తప్ప ఆయన పార్టీలో మరో నేత పేరు సీఎం పదవికి వినిపించట్లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమారుడు నిషాంత్ కి మంత్రి వర్గంలో చోటివ్వొచ్చన్న చర్చ జరుగుతోంది.

 

సీఎం ల రేసులో పలువురు

 

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ శకం ముగుస్తుండగా ఇప్పుడు ఆయన స్థానంలో బీజేపీ నేత బీహార్ సీఎంగా నియమితులయ్యే అవకాశం ఉంది. బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో పదవసారి ప్రమాణ స్వీకారం చేయగా.. సామ్రాట్ చౌదరి మరియు విజయ్ కుమార్ సిన్హా వరుసగా రెండవసారి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. బీహార్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లేదా బీహార్ మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ ముఖ్యమంత్రి రేసులో వున్నారు.సామ్రాట్ చౌదరి సీనియర్ బిజెపి నాయకులలో ఒకరు. ఆయన బీహార్‌లో హోం శాఖ, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేయడంతో పాటు రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నిత్యానంద్ రాయ్, ప్రస్తుతం హోం కేంద్రంలో వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అంకుముందు బీహార్‌కు బిజెపి అధ్యక్షుడిగా, హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. దిలీప్ కుమార్ జైస్వాల్ మూడుసార్లు శాసనమండలి సభ్యడుగా అనుబవం తో పాటు రాష్ట్ర బిజెపి చీఫ్‌గా కూడా పనిచేశారు. దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా పేరు కూడా వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకువచ్చే సంప్రదాయమున్నబీజేపీలో ఈసారీ ఏమైనా జరగొచ్చనన్న గుసగులూ వినిపిస్తున్నాయి. ప్రస్తుత గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ సీఎంల తెరపైకి వచ్చిన ఉదంతాలు ఉదాహరణగా కూడా చెప్పుకుంటున్నారు.

Latest