- ఇన్స్టా పరిచయం
- తల్లి బంగారం అమ్మేసి ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చిన యువతి
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
- విస్తుపోయిన పోలీసులు
సిరిసిల్ల, మహా : సోషల్ మీడియా పిచ్చిలో పడిపోతున్న యువత గాడి తప్పి తామేం చేస్తున్నారో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. చదువుకునే వయసులోనే ప్రేమ, పెళ్లిళ్లు అంటూ తప్పటడుగులు వేస్తూ ఒకరిని ఒకరు చూసుకోకుండానే ప్రేమలో పడిపోతున్నారు. తల్లిదండ్రులను తెలియకుండా అన్నీ సమర్పించేసుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఓ యువతి చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టా ప్రియుడి కేసం తల్లి బంగారాన్ని అమ్మేసి ఖరీదైన బైక్ కొనిచ్చిన యువతి ఘటన ఒకటి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో యువతికి ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఆ యువకుడు యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు.
తనకు ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కావాలని అది కొనిస్తేనే మన ప్రేమ కొనసాగుతుందని సదరు యువకుడు యువతిని డిమాండ్ చేశాడు. ప్రియుడి కోరిక తీర్చడానికి తన దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో ఆ యువతి అడ్డదారి తొక్కింది. ఇంట్లో తల్లి దాచుకున్న బంగారు ఆభరణాలను తీసుకెళ్లి అమ్మి వచ్చిన డబ్బుతో ప్రియుడు కోరిన విలాసవంతమైన బైక్ను కొని గిఫ్ట్ కింద ఇచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఉండాల్సిన బంగారం కనిపించకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఇంట్లో వెతికినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూతురిపై అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పింది. తానే బంగారాన్ని కొట్టేసి తన ప్రియుడికి బైక్ కొనిచ్చినట్లు ఒప్పుకుంది. కన్నకూతురే ప్రియుడి కోసం ఈ పని చేసిందని తెలిసి ఆ తల్లి షాక్కు గురైంది. కూతురు చేసిన ఘన కార్యాన్ి తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.








