Mahaa Daily Exclusive

  అప్పుడు వైఎస్.. ఇప్పుడు రేవంత్.. కాంగ్రెస్ పై పట్టు సాధించడంలో అసాధ్యులు..!

Share

  • అప్పుడు వైఎస్.. ఇప్పుడు రేవంత్
  • కాంగ్రెస్ పై పట్టు సాధించడంలో అసాధ్యులు
  • పార్టీని గుప్పిట్లో పెట్టుకోవడంలో సఫలమైన నేతలు
  • వేం నరేందర్ రెడ్డి ఎంపికతో నిరూపణ
  • రేవంత్ మార్క్ పాలిటిక్స్ అంటున్న కాంగ్రెస్ శ్రేణులు

 

హైదరాబాద్, మహా : కాంగ్రెస్ అంటే గ్రూపు రాజకీయాలు, అసమ్మతి గళాలు, ఎవరు ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో తెలియని పరిస్థితి. ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు అంతా ఒకే నేత పెత్తనం. ఆయనే పార్టీ, పార్టీనే ఆయన. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే రేవంత్ రెడ్డి పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. కీలక పదవులన్నీ తన కనుసన్నల్లోనే భర్తీ అయ్యేలా చూసుకుంటున్నారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద తన మాటే శాసనమని ఆయన నిరూపించుకుంటున్నారు. కేవలం పాలనకే పరిమితం కాకుండా, పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టును రేవంత్ రెడ్డి సాధించారు. తద్వారా ఒకప్పుడు రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్లు సైతం ఇప్పుడు ఆయన కనుసన్నల్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా వ్యతిరేక గళం వినిపిస్తే వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న హెచ్చరికను రేవంత్ తన వ్యూహాల ద్వారా స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ పార్టీలో నేనే హైకమాండ్ అనే స్థాయికి ఆయన ఎదిగారు, ఇది గత దశాబ్ద కాలంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ సాధ్యపడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా, సీఎం గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న పరిస్థితి తాజాగా కాంగ్రెస్ లో కనిపిస్తుంది.

 

అసంతృప్త నేతలు వ్యూహం మార్చుకోవాల్సిందే

 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్ నేతలు కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో విభేదాలు ఉన్నప్పటికీ, రేవంత్ సాధించిన రాజకీయ విజయం చూశాక, ప్రస్తుతానికి ఆయనతో కలిసి వెళ్లడమే శ్రేయస్కరమని వారు భావిస్తున్నారు. తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా, రేవంత్ వ్యూహాల ముందు అవి ఫలించడం లేదని అర్థం చేసుకున్న నేతలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటం లేదా రేవంత్ భజన వైపు మళ్లడం మినహా మరో దారి లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి బలం కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల వద్ద ఆయన సంపాదించుకున్న నమ్మకం అసాధారణం. రాష్ట్రం నుండి ఏ నిర్ణయం వెళ్లినా దానికి ఢిల్లీ ఆమోదముద్ర వేస్తుండటంతో, స్థానిక సీనియర్లు హైకమాండ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశాలు మూసుకుపోయాయి. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు దక్కడం అనేది రేవంత్ రెడ్డి ఢిల్లీ లాబీయింగ్‌లో సాధించిన అతిపెద్ద విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

 

సాధారణ కార్యకర్తల్లో రేవంత్ రెడ్డి పట్ల ఉన్న ఆదరణే ఆయనకు కొండంత అండగా నిలుస్తోంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడంలో ఆయన చూపిస్తున్న చొరవ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీని ఒక కార్పొరేట్ తరహాలో క్రమశిక్షణతో నడిపిస్తూనే, తనను వ్యతిరేకించే శక్తులను ఒక్కొక్కటిగా ప్రక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ శకం మొదలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, తాజాగా ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు లేని పార్టీగా ఎదగడంతో రేవంత్ కు మరింత ప్లస్ పాయింట్ గా మారింది. రాబోయే ఏ ఎన్నికలైనా, ఏ నిర్ణయమైనా రేవంత్ తీసుకునేదే తుది నిర్ణయంగా మారిందన్న సంతోషం పార్టీలో పెరిగింది. ఈ విషయాలన్నీ గ్రహించిన కాంగ్రెస్ లోని మిగతా నేతలు ఏదైతే ఏం పార్టీ పెరుగుతుంది ఇదే చాలు అనే పరిస్థితికి వచ్చారు. నిన్నటి వరకు రేవంత్ నాయకత్వంపై అధిష్టానం అయిష్టంగా ఉందన్న చర్చ కూడా ప్రస్తుతం కనుమరుగైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో రేవంత్ అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో రాబోయే కాలంలో పార్టీకి ఆయన అవసరం కీలకమవుతుందని, అధిష్టానం కూడా ఆయన వ్యూహాలను అమలు చేసేందుకు సిద్దంగా ఉందన్న అభిప్రాయంతో ఉన్న మిగతా నేతలు ఇప్పుడేం మాట్లాడినా చెల్లుబాటు కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఏం మాట్లాడినా కార్యకర్తల ముందు చులకనవుతామన్న అభిప్రాయంతో ఉన్న నేతలు సర్ఖుకుపోదాం రండి అంటున్నారు.

Latest