హైదరాబాద్, మహా
మాదిగల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మద్దతిస్తూ అండగా నిలిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అధికార దుర్వినియోగానికో మూటలు సంపాదించుకోవడానికో రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహా, మాదిగ సామాజిక వర్గ ఉద్యోగులు పాల్గొన్నారు. : భవిష్యత్తులో మాదిగ, మాదిగ ఉపకులాల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరు బాధ్యతతో వ్యవహరిస్తేనే అనుకున్న న్యాయాన్ని చేయగలుగుతానని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రగతి ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండవద్దని అధికారులకు సూచించారు. మీ సమస్యలు పరిష్కరించేటప్పుడు అడ్డుకునే వారిని మీరే నిలువరించాలంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పన్నుల సక్రమంగా వసూలు చేసి ఖజానా నింపితే పేదలకు మేలు జరుగుతుందని అన్నారు.
విద్యకు ప్రభుత్వం పెద్దపీట
అట్టడుగు స్థాయిలో ఉన్న మాదిగ, ఉపకులాల అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ‘ప్రజా ప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక’ పేరుతో చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ ముందుండాలన్న సీఎం అందుకు విద్య కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందరూ చదువుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతిలోపు మాదిగల సమస్యలు తీర్చేందుకు నిధులిస్తామని, నివేదికలు సిద్ధం చేయాలని సీఎస్కు రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంను మాదిగ కులాల నేతలు సన్మానించారు.
ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి చదువొక్కటే
పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని చదువొక్కటే ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి అని రేవంత్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్య కోసం ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేసేది మీరే అని మాదిగ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. భవిష్యత్తులో మాదిగల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తామని వివరించారు. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలను ఇచ్చిందని, మాదిగలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా మీ పిల్లలు మాత్యం రాజ్యాలు ఏలాలా అని బీఆర్ఎస్ అధినేతను ఉద్దేశించి విమర్శించారు. మాదిగల సమస్యలను పరిష్కారంపై నివేదికలు తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహాను ఆదేశించారు. వాటిపై సమీక్ష చేసి అంబేడ్కర్ జయంతిలోగా మంజూరు చేస్తామని తెలియజేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు, సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని వివరించారు. జాతి అభివృద్ధికి అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తన లాంటి వ్యక్తికి మంత్రిగా బాధ్యతలు ఇచ్చారని అన్నారు.








