- పౌల్ట్రీ రంగంలో మహిళలది కీలక పాత్ర
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు
హైదరాబాద్, మహా : దేశ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో మహిళలు పోషిస్తున్న పాత్ర అమోఘమని పలువురు ప్రముఖులు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ), పౌల్ట్రీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పౌల్ట్రీ, దాని అనుబంధ పరిశ్రమల్లో మహిళా పారిశ్రామికవేత్తలు, నాయకుల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ డి. సమత వెంకట రెడ్డి, ఎస్ఆర్ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సీతా రంజిత్ రెడ్డి, రెయిన్బో హాస్పిటల్స్ (బర్త్‌రైట్) చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరాణ్మయి అడ్డు హాజరయ్యారు. మహిళా సాధికారత, నాయకత్వ లక్షణాలు మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో పోషకాహార ప్రాముఖ్యతపై వారు తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా తోడ్పడుతున్నాయో డాక్టర్ కిరాణ్మయి వివరించారు.
పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి కల్పనలో, పోషకాహార భద్రతలో పౌల్ట్రీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఫామ్ మేనేజ్మెంట్ నుంచి కార్పొరేట్ నిర్ణయాల వరకు మహిళలు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, వారి విజయాలను గుర్తించి మరింత మందిని ఈ రంగం వైపు ప్రోత్సహించేందుకు పౌల్ట్రీ ఇండియా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగంలోని మహిళా ప్రతినిధుల విజయగాథలను మరియు వారి అనుభవాలను వెలుగులోకి తెచ్చేందుకు ఐపీఈఎంఏ ప్రత్యేక ‘అవుట్‌రీచ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అదేవిధంగా, హైదరాబాద్ వేదికగా జరగనున్న 18వ ఎడిషన్ ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2026’ వివరాలను కూడా ఈ వేదికపై ప్రకటించారు. నవంబర్ 24న నాలెడ్జ్ డే నిర్వహిస్తామని, అనంతరం నవంబర్ 25 నుండి 27 వరకు ప్రధాన ఎక్స్పో కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, భాగస్వాములు భారీ సంఖ్యలో పాల్గొంటారని పేర్కొంటూ కార్యక్రమాన్ని ముగించారు.
ఇ కార్యక్రమంలో ఏం.శ్రీకాంత్, ట్రెజరర్ పౌల్ట్రీ ఇండియా, మరియు పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.








