Mahaa Daily Exclusive

  మిల్లర్ల ‘మెగా’ దోపిడీకి అధికారుల అండదండలు.!

Share

  • మిల్లర్ల ‘మెగా’ దోపిడీకి అధికారుల అండదండలు.!
  • 12 ఏళ్లు 24 సీజన్లు ఏకంగా రూ. 7,261 కోట్ల ప్రభుత్వ సొమ్ము స్వాహ చేసినట్లు అనుమానాలు.?
  • ​ఉద్యమాల జిల్లాలో అవినీతి తిమింగలాలు..
  • కేసుల సమాచారం లీక్ మిల్లర్ల పరారీకి అధికారి సహకారం..
  • రూ.192 కోట్లు దోచుకుంటే రికవరీ కేవలం రూ. లక్ష తొమ్మిది వేలు మాత్రమే..
  • ​ఏసీ గదుల్లో కూర్చుని పాపాన్ని పంచుకుంటున్న ఉన్నతాధికారులు..

​నల్గొండ,మహా : ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరిపోసి పోరాటాల గడ్డగా నిలిచిన నల్గొండ జిల్లా.. ఇప్పుడు అవినీతి తిమింగలాలకు అడ్డాగా మారుతోంది. దేశంలో బ్యాంకుల సొమ్ము ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే దొంగలను చూశాం కానీ ఇక్కడ మాత్రం మిల్లర్లు ఏకంగా ప్రభుత్వాలకే సున్నం వేస్తున్నారు. పేదవాడి ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని అప్పనంగా బుక్కేస్తూ వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మేసేస్తున్నారు. ఈ మహా దోపిడీకి వ్యవస్థలు సైతం సహకరిస్తున్నాయా? ఏసీ గదుల్లో సేద తీరే ఉన్నతాధికారులు సైతం ఈ పాపంలో పాలుపంచుకుంటున్నారా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లకు ముసుగేయకుండా మాయ చేస్తోన్న ఆ ‘చీటర్స్’ ఎవరు?

12 ఏళ్లు..24 సీజన్లు..రూ. 7,261 కోట్ల దోపిడీ?

​ఉమ్మడి నల్గొండ జిల్లాలో సి ఎం ఆర్ స్కామ్ గత 12 సంవత్సరాలుగా 24 సీజన్లకు సంబంధించి మిల్లర్లు సాగించిన దోపిడీ అక్షరాలా రూ. 7,261 కోట్ల రూపాయలు అని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ, ప్రజల, రైతుల సొమ్మును మిల్లర్లు అప్పనంగా బుక్కేశారా?లంచాల మత్తులో మునిగిపోయిన ఉన్నతాధికారులు ఈ దోపిడీకి అండదండలు అందిస్తూ మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.​

‘లీక్’ వీరుడు.. మిలర్ల పరారీకి దారి చూపిన అధికారి?

​జిల్లాలోనే కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన ఒక ఉన్నతాధికారి మిల్లర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిని కాపాడుతున్నట్లు తెలుస్తోంది. “మీపై కేసులు పెడుతున్నారు.. రేపు పోలీసులు వస్తారు” అని ముందస్తు సమాచారం అందించి వారు పారిపోయేలా చేసినట్లు, సదరు అధికారి ఇచ్చిన సమాచారంతోనే మిల్లర్లు గోవా, కర్ణాటక, వికారాబాద్ వంటి ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం. అక్రమంగా రూ. 192 కోట్ల మేర బియ్యాన్ని దారి మళ్లించిన కేసులో ఐదుగురు మిల్లర్లు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. రూ. 43 కోట్లు దోచేసిన ఇద్దరు మిల్లర్లను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు.

రికవరీ సున్నా పేదల కష్టం పందికొక్కుల పాలు.!

​మిల్లర్లు దోచుకున్న రూ. 192 కోట్ల రూపాయలలో రికవరీ చేసిన మొత్తం కేవలం రూ. 1.09 లక్షలు మాత్రమే! అంటే మిల్లర్లు ఏ స్థాయిలో దోచుకున్నారో అధికారులు ఏ స్థాయిలో సహకరించారో అర్థం చేసుకోవచ్చు. మిల్లర్లను కాపాడుతున్న ఆ ఉన్నతాధికారి ఎవరు? అతనిపై చర్యలు తీసుకుంటారా? రెవెన్యూ యాక్ట్ ప్రకారం మిల్లర్లు దోచుకున్న సొమ్మును రికవరీ చేస్తారా? మిలర్లకు సహకరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా ధనాన్ని లూటీ చేసిన వారిని వదిలిపెట్టకూడదని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Latest