- హెచ్ పి వి టీకా మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచం
- సూర్యాపేట జిల్లాలో మార్చి 8 నుంచి హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం
సూర్యాపేట జిల్లా మహా
సూర్యాపేట జిల్లాలో బాలికల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ టీకాకరణ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పెండెం వెంకట రమణ తెలిపారు.14 సంవత్సరాలు పూర్తిచేసి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు ఈ టీకాను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా ఆసుపత్రి, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ఏరియా ఆసుపత్రులు నడిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కె. కోటి రత్నం మాట్లాడుతూ, జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా మొత్తం జనాభా 11,96,409 ఉండగా, అందులో 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలు సుమారు 1 శాతం ఉంటారని అంచనా వేయగా, మొత్తం 11,964 మందికి ఈ టీకా అవసరం ఉంటుందని చెప్పారు.
నిర్దిష్ట ప్రమాణాలను పాటిస్తూ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ద్వారా టీకా ఇవ్వనున్నట్లు వివరించారు. స్త్రీలలో ప్రాణాంతకంగా మారే గర్భకోశ కంఠపు క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ కోసం ఈ హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమావైరస్) వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు తమ బాధ్యతగా 2011 ఏప్రిల్01 నుండి 2012 మార్చి 31 మధ్య జన్మించిన అర్హత గల బాలికలను సంబంధిత వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకువెళ్లి టీకా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. టీకా తీసుకునే సమయంలో బాలికలు జనన తేదీ నిర్ధారణకు సంబంధించిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని, తల్లి లేదా తండ్రి సమక్షంలో సమ్మతి పత్రం సమర్పించి టీకా తీసుకోవాలని సూచించారు. అలాగే వచ్చే నెల నుంచి జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కూడా ఈ టీకా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. టీకా గురించి ఎలాంటి అపోహలు లేదా సందేహాలు ఉంటే సమీప ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, ఎన్జీఓ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బందికి సహకరించి జిల్లాలో 100 శాతం టీకా జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.







