Mahaa Daily Exclusive

  మహిళలకు అవకాశమిస్తే  అద్భుతాలు చేస్తారు : మంత్రి దామోదర రాజనర్సింహ

Share

 

 

హైదరాబాద్, మహా: మహిళలకు అవకాశం ఇస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఒక మహిళ చదువుకుంటే ఒక తరమే ముందుకు వెళుతుందని, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం అని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్కతో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసీ భవన్‌లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను మంత్రులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో మహిళల ఆరోగ్య పరీక్షలు, క్యాన్సర్ టీకాలపై రూపొందించిన షార్ట్ వీడియోస్‌ను ప్రదర్శించారు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత, వసతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను, సెర్ప్ గతేడాది సాధించిన విజయాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను మంత్రులు సన్మానించారు.

 

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… మహిళలు ఎదగడానికి ఆకాశమే హద్దని, అవకాశం ఇస్తే వారు అసాధ్యాన్ని కూడా సాధిస్తారని కొనియాడారు. మహిళా సాధికారత కేవలం సంక్షేమ నినాదం కాదని, అది దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగానే కాదు, ఆరోగ్యంగానూ బలంగా ఉండాలనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఉన్న 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. సెర్ప్ సహకారంతో మహిళలను సమీప పీహెచ్‌సీలకు తీసుకెళ్లి బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 30 రకాల కీలక పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఆరోగ్య పరీక్షల అనంతరం ప్రతి మహిళకు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డును సృష్టించి, ఈ – హెచ్ఎంఐఎస్ పోర్టల్‌లో భద్రపరుస్తారని మంత్రి వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో వారి ఆరోగ్య సమస్యలను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చని మంత్రి వివరించారు.

Latest