Mahaa Daily Exclusive

  ఏపీ కాంగ్రెస్ లో విషాధం…… కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత…..

Share

హైదరాబాద్, మహా : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు సాంబశివరావు. 2013లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామం. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడు సార్లు, ఏలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కావూరి మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కావూరి సాంబశివరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజకీయ జీవితంలో ఆయన ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు.

యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కావూరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ ప్రగతి కన్స్ట్రక్షన్స్ స్థాపించారు. ఇందులో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు దూరం అవుతూ వచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం బలంగా గళం విప్పిన నేతల్లో కావూరి ఒకరు. కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు కావూరి. తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరారు అన్న వార్త తెలియగానే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కావూరి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మంత్రి నారా లోకేశ్ కూడా రెండురోజుల కిందట కావూరిని పరామర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Latest