Mahaa Daily Exclusive

  దేశంలో 14 మంది మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు: మొదటి మూడు స్థానాల్లోనూ ఏపీ ఎమ్మెల్యేలదే హవా!

Share

  • దేశంలోని మహిళా ప్రజాప్రతినిధులలో 14 మంది బిలియనీర్లు
  • మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే
  • ఏపీలోని 24 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు
  • తెలంగాణలోని 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.14 కోట్లు
  • నివేదిక విడుదల చేసిన ఏడీఆర్

హైదరాబాద్, మహా : దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధులలో (ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి) 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ (ఏడీఆర్) వెల్లడించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏడీఆర్ సంస్థ భారతదేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 543 మంది ఎంపీలు, 4123 మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 4666 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, అందులో మహిళల భాగస్వామ్యం కేవలం 464 మాత్రమే. అంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం పది శాతం మాత్రమే ఉందని నివేదిక వెల్లడించింది. 543 మంది ఎంపీలలో 74 మంది మహిళలు ఉన్నారని, 4123 మంది ఎమ్మెల్యేలలో మహిళా ఎమ్మెల్యేలు 390 మంది ఉన్నట్లు పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లలోని వివరాల ఆధారంగా వారిపై నమోదైన కేసులు, వారి ఆస్తుల వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఉమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రెప్రజెంటేషన్ ఇన్ ఇండియా పేరుతో మార్చి 8వ తేదీ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని మహిళా ప్రజా ప్రతినిధులలో 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ తెలిపింది. ఈ 14 మంది జాబితాలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మొదటి స్థానంలో ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

ఈ 14 మంది మహిళా ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తి విలువ రూ. 8,234 కోట్లని ఏడీఆర్ సంస్థ తెలిపింది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి ఉన్నారు. ఈమె ఆస్తుల విలువ రూ.388 కోట్లు. ఇక మూడో స్థానంలోనూ ఏపీ ఎమ్మెల్యేనే ఉండటం విశేషం. మూడవ స్థానంలో జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉన్నారు. ఈమె ఆస్తుల విలువ రూ.291 కోట్లుగా ఏడీఆర్ సంస్థ నివేదికలో వెల్లడించింది. ఏపీలోని 24 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లుగా ఉంటే.. తెలంగాణలోని 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా ఉందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదిక వెల్లడించింది.

Latest