మందమర్రి, మహా : మంచిర్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను, పెండింగ్ ఫైళ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ కార్యాలయాలలో పెండింగ్ పైళ్లను త్వరగా పరిష్కరించాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యచరణ జూన్ 12 వరకు ఉంటుందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో 99 రోజుల పాటు కార్యచరణ చేసినట్లు వెల్లడించారు. పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టితో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్లను పూర్తిగా పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు వారి పరిధిలోని అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకు, ఇతర నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







