- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
- ప్రభాకర్ రావుకు భారీ ఊరట
- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మహా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు భారీ ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా జస్టిస్ నాగరత్న ధర్మసనం మార్చింది. మరోవైపు దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచనలు చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని ప్రభాకర్ రావును హెచ్చరించింది. అంతేకాదు.. కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం, దేశం దాటడానికి వీళ్లేదని పేర్కొంది. ప్రభాకర్ రావు తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను టార్గెట్‌గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈకేసులో నిందితులైన పలువురు పోలీసు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో ప్రభాకర్రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వంటి వారు ఉన్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహారించిన ప్రభాకర్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా పలు సంచలన ఆరోపణలు ఉన్నాయి.







