Mahaa Daily Exclusive

  పార్లమెంట్‌లో ‘కౌగిలింత’ సెటైర్లు: రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు విమర్శలు.. ప్రియాంకా గాంధీ ఘాటు కౌంటర్

Share

  • కౌగిలించుకుంటాడు, కన్నుకొడతాడు
  • లోక్‌సభలో రాహుల్ గాంధీపై రిజిజు సెటైర్లు
  • ఘాటుగా స్పందించిన ప్రియాంక
  • 12 ఏళ్ళుగా తలవంచని నేత రాహుల్ గాంధీయేనని చురక

న్యూఢిల్లీ, మహా : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం సభలో మాటల యుద్ధం ముదిరింది. రాహుల్ గాంధీ గతంలో ప్రధాని మోదీని కౌగిలించుకుని, ఆ తర్వాత కనుసైగ చేసిన ఉదంతాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్లమెంట్ పట్ల ‘సీరియస్‌నెస్’ లేదని కిరణ్ రిజిజు విమర్శించారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన హిందీలో మాట్లాడుతూ.. “ప్రధానిని కౌగిలించుకుని, తిరిగి తన సీటులోకి వచ్చి తోటి ఎంపీలకు కన్ను కొట్టే (ఆంఖ్ మార్తా హై) నేతను నేనెప్పుడూ చూడలేదు” అని వ్యాఖ్యానించారు. అయితే రిజిజు ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో అటు రాహుల్ గాంధీ గానీ, ఇటు ప్రధాని మోదీ గానీ సభలో లేరు. 2018లో జరిగిన అవిశ్వాస తీర్మానం సమయంలో రాహుల్ గాంధీ నాటకీయంగా ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి కౌగిలించుకుని, ఆ తర్వాత తన స్థానంలో కూర్చుని కన్ను కొట్టారు. నాటి ఘటనను రిజిజు ఇప్పుడు మరోసారి ప్రస్తావించగా, అప్పట్లో బీజేపీ దీనిని ‘పిల్ల చేష్ట’గా అభివర్ణించింది.

రిజిజుకు ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్

రిజిజు ప్రసంగం ముగిసిన వెంటనే రాహుల్ సోదరి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “గత 12 ఏళ్లుగా తలవంచని ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే. అందుకే ఆయన ఏం చెప్పినా వీరు జీర్ణించుకోలేకపోతున్నారు” అని ఆమె చురకలంటించారు. మరోవైపు, రిజిజు తన ప్రసంగంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ప్రస్తావించడాన్ని కూడా ప్రియాంక తప్పుపట్టారు. “సాధారణంగా నెహ్రూను తిట్టిపోసే వీరు ఇప్పుడు అప్పటి స్పీకర్ జీవీ మావలంకర్‌ను సమర్థిస్తూ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకు నవ్వొస్తోంది” అని ఆమె ఎద్దేవా చేశారు.

మొఘల్ కవిత్వంతో ముగింపు

రిజిజు తన ప్రసంగాన్ని ఒక ఉర్దూ కవితతో (షాయరీ) ముగించారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్‌షా జఫర్ సందర్భంలో ముజ్తర్ ఖైరాబాద్ రాసిన ఈ కవితను ఆయన చదివి వినిపించారు. “నేను ఎవరి కంటికీ వెలుగును కాను, ఎవరి మనసుకూ శాంతిని కాను.. ఎవరికీ పనికిరాని ఒక పిడికెడు ధూళిని నేను” అని దాని అర్థం. అంతకుముందు, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ రికార్డులను పరిశీలిస్తే విపక్షాలను అత్యధికంగా అడ్డుకున్న మంత్రిగా కిరణ్ రిజిజు నిలిచిపోతారని విమర్శించారు. దీనికి హోం మంత్రి అమిత్ షా బదులిస్తూ సభా నిబంధనలు పాటించనప్పుడు అడ్డుకోవడం తప్పనిసరని సమర్థించారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఇంతలా మండిపడటానికి ప్రధాన కారణం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పుస్తకం. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రాసిన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను రాహుల్ గాంధీ ఇటీవల సభలో ప్రస్తావించారు. 2020లో చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో ప్రధాని మోదీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆ పుస్తకం ద్వారా ‘ఎండగట్టే’ ప్రయత్నం చేశారు. అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇవ్వని ఆ పుస్తక ప్రతిని సభలో ప్రస్తావించడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదమే చివరకు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం దాకా వెళ్లింది. ఈ అంశంపై బుధవారం అమిత్ షా సభలో ప్రసంగించనున్నారు.

Latest