Mahaa Daily Exclusive

  తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌? సీఎస్‌గా రామకృష్ణారావుకు సర్వీస్ ఎక్స్‌టెన్షన్?

Share

  • డీజీపీగా సీవీ ఆనంద్‌?
  • సీఎస్‌గా మరికొంత కాలం రామకృష్ణారావుకే చాన్స్‌
  • 20 లోగా తేలే అవకాశం
  • సీనియారిటీ, సిన్సియారిటీకి పాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉద్యోగకాలం ముగియనుండగా, ఆయన స్థానంలో ఆనంద్ నియామకం కానున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. 1992 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్.. రాష్ట్రంలోని పోలీస్ అధికారుల్లో అత్యంత సీనియర్. ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి 1994 బ్యాచ్ కు చెందిన అధికారి. శివధర్ రెడ్డి కన్నా ఆనంద్ సీనియారిటీ ఎక్కువైనందున రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ ల పేర్లతో ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి జాబితా పంపింది. ఈ జాబితాలో 1994 బ్యాచ్ నుంచి సౌమ్యమిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, 1995 బ్యాచ్ కు చెందిన శిఖాగోయల్ పేర్లు ఉన్నాయి. వీరిలో అందరి కన్నా సీనియర్, సమర్థుడిగా ఆనంద్ కు పేరున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆయనకే పదవి కట్టబెట్టేందుకు సానుకూలంగా ఉందని తెలిసింది.

సిఎస్ గా మరికొంత కాలం రామకృష్ణారావు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె రామకృష్ణారావు ఉద్యోగకాలం కూడా ఈ నెలాఖరుతో ముగియనున్నది. గత ఆగస్టులోనే ఆయన ఉద్యోగ విరమణ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏడు నెలల పాటు సర్వీస్ ఎక్స్ టెన్షన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో జనగణన అమలు తదితర కారణాలతో ఆయనకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని రేవంత్ సర్కార్ మరోసారి కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది. గతంలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సిఎస్ లకు ఏడాదికి పైగా సర్వీస్ ఎక్స్ టెన్షన్ ఇచ్చిన సందర్భాలున్న నేపథ్యంలో రామకృష్ణారావుకు కనీసం మూడు నెలల పాటు ఉద్యోగకాలం పొడిగించే అవకాశమున్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు చెప్తున్నారు.

ఆర్కేకు రాకపోతే జయేష్ కు పక్కా

ఒకవేళ రామకృష్ణారావుకు ఎక్స్ టెన్షన్ ఇవ్వకపోతే తదుపరి జాబితాలో 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఉన్నారు. ఆయనతో పాటు అదే బ్యాచ్ నుంచి వికాస్ రాజ్, సంజయ్ జాజు కూడా ఉన్నారు. వీరితో పాటు 1994 బ్యాచ్ కు చెందిన సబ్యసాచి ఘోష్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాన్ని ఆశిస్తున్నారు. వీరిందరి కన్నా సీనియర్, 1991 బ్యాచ్ అధికారి అరవింద్ కుమార్ కూడా ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆసక్తి లేనట్టు తెలుస్తున్నది. అదీగాక ఆయనపై ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టినందున సీఎస్ ఉద్యోగం వచ్చే అవకాశమే లేదని సమాచారం. రామకృష్ణారావుకు ఒకవేళ పొడిగింపు ఇవ్వని పక్షంలో జయస్ రంజన్ తదుపరి సీఎస్ కావడం ఖాయంగా కనిపిస్తున్నది.