- ఆదిలాబాద్ లో కౌన్సిలర్ల బాహాబాహీ
- వారు చర్చ కోరుకోలేదు.. రచ్చే
- కాంగ్రెస్ బిజెపి కౌన్సిలర్ల మధ్య తొలిపోరు
- ఎమ్మెల్యే పాయల్ శంకర్ వైఫల్యాలు కౌన్సిల్ పై రుద్దాలని చూస్తున్నారు- చైర్ పర్సన్ ఫైర్
ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కౌన్సిలర్లు పరస్పరం చొక్కాలు పట్టుకుని, బాహాబాహీకి దిగారు. ఇరు పార్టీల గందరగోళం మధ్యనే ఛైర్‌పర్సన్ అనూష ‘అజెండా పాస్’ అంటూ ప్రకటన చేసి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. అయితే చర్చ లేకుండానే అజెండాను ఎలా పాస్ చేస్తారని బీజేపీ కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చర్చ కోరుకోలేదని, రచ్చే కోరుకున్నారని చైర్ పర్సన్ మండిపడ్డారు. ఛైర్‌పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు బయటకు రాకుండా బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యంతో ఛైర్‌పర్సన్ బయటకు వచ్చారు. దీంతో దాదాపు మూడు గంటల పాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్ అజయ్, బీజేపీ కౌన్సిలర్ రాకేష్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాలకవర్గం సభను నామమాత్రంగా నిర్వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. నీటిసమస్యపై రెండున్నరేళ్ళుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని, మహిళా చైర్ పర్సన్ ను అవమానించే లక్ష్యంతో పాయల్ శంకర్ దురుద్దేశపూర్వకంగా సుదీర్ఘ ఉపన్యాసం చేసి కౌన్సిలర్లను రెచ్చగొట్టి వెళ్ళారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. పాయల్ శంకర్ నిర్లక్ష్యాన్ని, రెండున్నరేళ్ళ పనితీరును అడుగడుగునా కడిగిపారేస్తామన్నారు. ఆయన కబ్జాల బండారం బయటపెడతామని కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.








