- మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
- ఢిల్లీలో జోరుగా ప్రచారం
- హోం మంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోయే అవకాశం
- టార్గెట్ కు దగ్గరగా కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపించిన సిపిఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉందనే ప్రచారం ఢిల్లీలో వేగంగా వ్యాపిస్తోంది. దాదాపు 50 సంవత్సరాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గణపతి, 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పుకున్నారు. ఆ తరువాత ఆయన కార్యకలాపాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇటీవల జరిగిన ఆపరేషన్ కాగర్ తరువాత గణపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. గణపతి కొంతకాలంగా నేపాల్‌లో ఆశ్రయం పొందుతున్నారని, అక్కడి నుంచి ఇటీవల ఢిల్లీకి చేరుకున్నారని ప్రచారం జరుగుతోంది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన సాధారణ జీవితం గడపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆయన సాధారణ జీవితాన్ని ఎంచుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం గణపతితో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం వెలువడుతోంది. త్వరలోనే ఆయన అధికారికంగా లొంగిపోయే అవకాశం ఉందని భద్రతా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గణపతి లొంగుబాటు జరిగితే అది మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా భావిస్తున్నారు నిపుణులు. దీంతో మావోయిస్టు అగ్రనేతల శకం ముగిసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీర్పూర్ ప్రాంతంలో గణపతి జన్మించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ ఆయన స్వస్థలం. ఉద్యమంలో ఆయనను సహచరులు “టీచర్” అని పిలిచేవారు. 1970లలో రైతు పోరాటాలతో ఉద్యమ జీవితాన్ని ప్రారంభించిన గణపతి, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సలైట్ ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. నక్సలైట్ ఉద్యమ స్థాపకుల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి నాయకత్వం గణపతికి దక్కిందనే అభిప్రాయం ఉంది. దేశవ్యాప్తంగా మావోయిస్టు నెట్‌వర్క్ విస్తరణలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఆయన పర్యవేక్షణలో అనేక సంచలన దాడులు జరిగినట్లు భద్రతా సంస్థలు పేర్కొంటాయి. గణపతి భార్య సుజాత ప్రస్తుతం కూడా ఉద్యమంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక గణపతి లొంగుబాటు జరిగితే, దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు సాయుధ ఉద్యమానికి అది కీలక మలుపు కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.







