- గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు
- ఇదే అదనుగా దోపిడీ చేస్తున్న సైబర్ నేరస్థులు
- అలర్ట్ అంటున్న సీపీ సజ్జనార్
హైదరాబాద్, మహా : వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా, ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సూచించారు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని సూచించారు. నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.








